మన దేశంలో మతపరమైన అంశాలు చాలా సున్నితమైనవి. ఏమాత్రం తేడాలొచ్చినా గొడవలైపోతాయ్. ఏ మతానికీ అధికారిక హోదా లేని మన లౌకిక రాజ్యంలో ఎవరి మనోభావాలు వారివి. వాటిని గాయపరచకుండా ఇతరులు సహనం పాటించాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరైనా పరిధులు దాటితో అది దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతుంది.

ప్రస్తుతం ఏసు క్రీస్తుపై విడుదల కాబోతున్న ఓ పుస్తకం క్రైస్తవులు మనోభావలను కించపరిచేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఏసుక్రీస్తు భారత దేశానికి తమిళ హిందువు అనే కోణంలో రాసిన ఓ పరిశోధనాత్మక పుస్తకం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వాస్తవానికి ఈ పుస్తకం ఇప్పుడు రాసిందేమీ కాదు. ఇది 1946లో గణేశ్ సావర్కర్ అనే రచయిత దీన్ని రాశారు.

క్రీస్తు పరిచయ్ పేరుతో మరోసారి పాఠకుల ముందుకు వస్తున్న ఈ పుస్తకంలో ఏసును సిలువ వేసిన తర్వాత ఆయన్ను హిమాలయాలకు తీసుకువచ్చి ఆయన గాయాలకు చికిత్స చేశారని ఈ పుస్తకంలో రాశారట. వాస్తవానికి నేటి పాలస్తీనా,ఇజ్రాయిల్ ఒకనాటి భారత ఖండంలో భాగమేనట. అక్కడ జన్మించిన క్రీస్తు మాతృభాష తమిళమట..

ఇలా సాగుతోందీ కథనం. దీనిపై కొన్ని క్ర్రైస్తవ సంస్థలు తప్పబడుతున్నాయి. చరిత్రను వక్రీకరించే ఇలాంటి పుస్తకాలను విడుదల కానివ్వబోమంటున్నారు. గణేష్‌ సావర్కర్ మరణించి సుమారు డెబ్భై ఏళ్ళు గడుస్తున్న ఈ సమయంలో ఇప్పడు మళ్లీ దాన్ని వెలికి తీసి విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ విమర్శిస్తోంది. 

ఇలాంటి నిరాధార పుస్తకం వల్ల క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటాయని వాపోయారు. క్రీస్తు చరిత్రను వక్రీకరిస్తూ కోట్లాది క్రైస్తవుల మనోభావాలు కించకపరచడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేసారు. మొదటి శతాబ్ధంలో బ్రతికిన క్రీస్తు గురించి.. 20వ శతాబ్ధంలో పుట్టిన గణేష్‌ సావర్కర్ ఎలా పుస్తకం రాయగలడని  ఆలిండియా ట్రూ క్రిష్టియన్ కౌన్సిల్ ప్రశ్నిస్తోంది. 

క్రీస్తు పరిచయ్ పుస్తకాన్ని వెంటనే నిలుపుదల చేసి దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలంటున్నారు. ఈ మేరకు విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలిపారు. గణేష్‌ సావర్కర్ 1946కు ముందు రాసిన "క్రీస్తు పరిచయ్‌'' పుస్తకం పూర్తిగా అవాస్తవమైందని... ఇలాంటి నిరాధార పుస్తకాన్ని ఇప్పుడు ప్రజల మధ్యకు తీసుకురావద్దంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: