కొత్తపల్లి గీత.. గత పార్లమెంటు ఎన్నికల్లో అరకు నుంచి గెలిచారు. కిషోర్ చంద్రదేవ్ వంటి సీనియర్ ను మట్టి కరిపించారు. వైసీపీ నుంచి గెలిచినా.. కొద్ది రోజుల్లోనే ఈమె తెలుగుదేశం బాట పట్టారు. అధికారికంగా టీడీపీలో చేరకపోయినా ఆ పార్టీ సభ్యురాలుగానే వ్యవహరిస్తున్నారు. వైసీపీతో బంధనాలు తెంచుకున్నారు. ఐతే.. ఈమె కులంపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. 

ఆమె ఎస్టీకాదని కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ సాగుతోంది. ఈ దశలో మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. ఎంపీ కొత్తపల్లి గీత సోదరుడు వివేకానంద ఎస్టీ కాదని తేలింది. తమ్ముడు ఎస్టీ కానప్పుడు అక్క ఎస్టీ ఎలా అవుతుంది.. ఏదేమైనా ఈ కమిటీ తన విచారణలో తేలిన అంశాలతో విశాఖ కలెక్టరుకు నివేదిక ఇచ్చింది. ఆయన ఎంపీ గీత వివరణ కోరారు.

ఐతే.. కొత్తపల్లి గీత మాత్రం విచారణ కు హాజరుకాకుండా కావాలనే జాప్యం చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇన్నాళ్లూ కొత్తపల్లి గీతపై అక్కసుతో ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు రెచ్చిపోతున్నారు. కమిటీ రిపోర్టు ప్రకారం కొత్తపల్లి గీత నైతిక బాధ్యత వహించి తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ పాడేరు ఎమ్మెల్యే  గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు.

కొత్తపల్లి గీత.. ఎమ్మార్వోలను  ప్రలోభపెట్టి నకిలీ కుల ధృవీకరణ పత్రం సంపాదించి ఎన్నికల బరిలో నిలిచారని ఆమె అంటున్నారు. నకిలీ సర్టిఫికెట్లతో అసలైన గిరిజనుల అవకాశాలను దెబ్బకొట్టారన్నారు.  తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ముందు విచారణకు అమె ఉద్దేశపూర్వకంగానే హాజరుకాలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన వ్యతిరేకిగా వ్యవహారిస్తున్నారని ఈశ్వరి అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: