2014 ఎన్నికల్లో గెలుపు కోసం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు చేసిన వాగ్దానాలు అన్నీ ఇన్నీ కావు.. ప్రత్యేకించి చంద్రబాబు అయితే వందల కొద్దీ హామీలు గుప్పించారు. అడిగినవారికీ అడగని వారికీ అందరిపైనా హామీల వర్షం కురిపించేశారు. మొత్తానికి అధికార పీఠం అందుకున్నారు. అయితే ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మాత్రం నానా ఇబ్బందులు పడుతున్నారు.

అసలే ఆర్థిక లోటుతో ప్రయాణం ప్రారంభించాం..విభజనలో అన్యాయం జరిగింది.. అంటూ కష్టాల చిట్టా విప్పే చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను పక్కన పెట్టేశారు. వాటిలో నిరుద్యోగ భృతి ఒకటి. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క నిరుద్యోగికీ భృతి ఇస్తామని బాబు అప్పట్లో హామీ ఇచ్చారు. వాస్తవానికి అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. 

చంద్రబాబు చేతులెత్తేసిన ఈ హామీని తెలంగాణలో కేసీఆర్ నెరవేరుస్తానంటున్నారు. తెలంగాణలో నిరుద్యోగ యువతకు భృతి కల్పించే అంశం పరిశీలిస్తామని ఆయన ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన లైవ్ ప్రోగ్రామ్ లో సెలవిచ్చారు. ఆంధ్రాలో చంద్రబాబు ఇలాంటి హామీ ఇచ్చి... అదికారంలోకి వచ్చాక అమలు చేయలేకపోయిన విషయాన్ని కూడా  కేసీఆర్ ప్రస్తావించడం విశేషం. 

కాకపోతే ఈ హామీని అమలు చేస్తే దుర్వినియోగం అయ్యే ఛాన్సు ఎక్కువగా ఉందని.. అందుకే దీనిపై సమగ్ర మైన చర్చ జరగాలని కేసీఆర్ పిలుపు ఇచ్చారు. కూలంకషంగా పరిశీలించిన తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ అంటున్నారు. నిజంగా కేసీఆర్ ఈ పని చేస్తే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. చదువులు చదివి.. సొంత కాళ్లపై నిలబడ లేక.. ఉద్యోగాలు రాక.. ఏళ్లొచ్చినా కన్నవారిపై ఆధారపడే నిజమైన నిరుద్యోగులకు భృతి ఇస్తే మంచిదే కదా..!



మరింత సమాచారం తెలుసుకోండి: