ఎవరైనా దేవుడిని ఎందుకు పూజిస్తారు.. తమ కోరికలు తీర్చమని.. అంతగా కోరికలు లేని మహానుభావులు.. ఈ లోకమంతా బావుండాలని.. కోరుకుంటారు. కానీ దేవుడిని దర్శించుకుని పూజిస్తే అపచారం తలపెట్టే దేవుళ్లుంటారా.. ఉంటారనే చెబుతున్నారు మనదేశంలోని ఓ స్వామీజీ.. అది కూడా ఆ దేవుడు కేవలం ఆడవాళ్లకే ఇబ్బందులు సృష్టిస్తాడట.

ఇంతకీ ఆ దేవుడు ఎవరు.. అలా చెప్పిన బాబా ఎవరనే కదా మీ అనుమానం.. అలా చెప్పిన స్వామీజీ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి. ఆయన చెప్పింది శని దేవుని గురించి. శని శింగనాపూర్ ఆలయంలో మహిళలు ప్రవేశిస్తే వారిపై లైంగిక దాడి కేసులు పెరుగుతాయని స్వరూపానంద అంటున్నారు. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించడం ద్వారా గొప్ప విజయం సాధించామని భావించకూడదట. 

మహిళలు తామేదో ఘన కార్యం చేసినట్టు ఆనందపడిపోకూడదట. శని దేవుడిని ఆరాధించడం వల్ల దరిద్రం చుట్టుకుంటుందట.. ప్రత్యేకించి లైంగిక దాడి వంటి కేసులు పెరుగుతాయట. అందుకే శని ఆలయంలోకి మహిళలు ప్రవేశించకుండా 400 ఏండ్లుగా నిషేధం అమల్లో ఉందట. శనిని ఆరాధించడం మహిళలకు అంత మంచిది కాదంటున్న స్వరూపానంద... పురుషులు మత్తు పదార్థాలను సేవించకుండా నిరోధించేందుకు మహిళలు జాగ్రత్తలు తీసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు. 

స్వరూపానంద వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా మహిళావాదులు, లౌకిక వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వరూపానంద వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమైనవని, రాజ్యాంగానికి వ్యతిరేకమైనవని మండిపడుతున్నారు. మరి ఇన్నాళ్లూ మహిళలు శని ఆలయంలో ప్రవేశించలేదు.. మరి ఎందుకు ఇన్నాళ్లూ అత్యాచారాలు జరిగాయి అని సీపీఎం నాయకురాలు బృందాకరత్ నిలదీశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: