తెలంగాణలో ప్రస్తుతం రాజకీయంగా కేసీఆర్ కు ఎదురేలేదు. ఇప్పుడే కాదు కదా.. సమీప భవిష్యత్తులో కూడా ఆయన్ను ఎదుర్కొనేంత స్టామినా ఉన్న నాయకుడు కనిపించడం లేదు. పార్టీల వారీగా చూసుకున్నా.. టీఆర్ఎస్ కు దీటుగా నిలబడే పార్టీయే కనిపించడం లేదు. తెలంగాణ వచ్చాక జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ దే గెలుపు. 

ఇలాంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. కనీసం తమ ఉనికి కూడా లేకుండా తమ నాయకులను కలిపేసుకోవడంతో టీడీపీ, కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. టీఆర్ఎస్ విజృంభణను ఎలా అడ్డుకోవాలో తెలియక జుట్టుపీక్కున్నాయి. అసలు ఏ అంశంపై ప్రజల్లోకి వెళ్లాలో తెలియని పరిస్థితి. కొన్నాళ్లు వేచి ఉందామంటే పార్టీల ఉనికే కనుమరుగవుతోందాయె.

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జిల్లా ఉద్యమాలు.. 


ఈ సమయంలో కేసీఆర్ ప్రతిపాదించిన కొత్త జిల్లాల వ్యవహారం ప్రతిపక్షాలకు ఊపిరిపోసింది. సహజంగానే ప్రతి జిల్లాలోనూ 3 నుంచి 4 కొత్త జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయి. కొన్నిచోట్ల వీటి సంఖ్య ఆరు వరకూ ఉంది. కానీ వీటిలో ఖారయ్యేది దాదాపుగా జిల్లాకు ఒకటి రెండే. అందుకే తమ ప్రాంతాన్ని జిల్లాకు మార్పించుకోవాలన్న తపనతో జిల్లా ఉద్యమాలు వచ్చేశాయి. 

దీన్ని ఆసరాగా చేసుకున్న విపక్షాలు.. ఈ అంశాన్ని భుజానికెత్తుకున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాతిపదికన, ఏయే అంశాలను పరిగణలోనికి తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారో ప్రకటించాలని కాంగ్రెస్ మండిపడుతోంది. ఇప్పటికే అనేక జిల్లా ఉద్యమాల్లో టీడీపీ, కాంగ్రెస్ చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో కొన్ని పోరాటాల్లో విజయం సాధించినా ఆయా ప్రాంతాల్లో విపక్షాలు బలపడం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: