నేను నిప్పులాంటి.. నాపై 32 ఎంక్వయిరీలు వేశారు.. ఏమీ చేయలేకపోయారు.. విలువలతో కూడిన రాజకీయం నాది.. ఇవీ తరచూ చంద్రబాబు చెప్పే మాటలు.. ఈ మాటలు ఆయన ఎప్పటి నుంచో చెబుతున్నారు. మనం వింటూనే ఉన్నాం.. రాజకీయ ప్రత్యర్థిగా వైఎస్ ఉన్నప్పుడూ ఈ మాటలే చెప్పారు.. అప్పుడు కూడా విన్నాం.. కానీ ఈ మధ్య ఎందుకో ఈ మాటలు కాస్త కామెడీ అనిపిస్తున్నాయి. 

తాజాగా చంద్రబాబు తాను ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ఇవే మాటలు చెప్పుకొచ్చారు.. ఆయనేమన్నారంటే.. నేను ప్రధాని నరేంద్ర మోడీకి భయపడుతున్నానని కొందరు అంటున్నారు.. మరో వైపు కెసిఆర్ కు భయపడుతున్నారని అంటున్నారు.. కాని నేనెందుకు వాళ్లకు భయపడుతాను.. నాపై కేసులు ఏమున్నాయి.. చెప్పండి తమ్ముళ్లూ.. ఇవీ బాబు తాజా డైలాగ్స్.. 



నిజమే చంద్రబాబు కేసీఆర్ కు అస్సలు భయపడరు.. కానీ ఎవరో తరిమినట్టు విజయవాడకు అర్జంటుగా పాలన ఎందుకు మార్చేశారో చెప్పరు.. పోనీ సొంత రాష్ట్రంపై ప్రేమే అనుకుందాం.. అలాంటప్పుడు కోట్లకు కోట్లు తగలేసి హైదరాబాద్ ఆఫీసును ఎందుకు రీమోడలింగ్ చేయించుకున్నట్టు..ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం రాదు.. 

నిజమే చంద్రబాబు అస్సలు కేసీఆర్ కు భయపడరు.. కానీ ఓటుకునోటు కేసులో మనవాళ్లు బ్రీఫ్డ్ మీ.. అనే గొంతు మాత్రం తనదో కాదో చెప్పరు.. పైగా చెప్పకపోగా.. అసలు తన ఫోన్ రికార్డు చేయడమే పెద్ద తప్పు అంటారు.. అంతేకాదు.. దాదాపు ఏడాది దాటుతున్నా.. సెక్షన్ 8 సందర్భంగా తెలంగాణ సర్కారు పెద్దలపై పెట్టిన కేసులు ఏమయ్యాయో మాత్రం చెప్పరు..

అవును నిజమే చంద్రబాబుకు మోడీ అంటే అస్సలు భయం లేదు.. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమని మాత్రం గట్టిగా అడగరు.. పోనీ రావాల్సిన విభజన హామీలైనా సరిగ్గా రప్పించుకుంటారా అంటే ఆ పని చేయారు.. అయినా సరే.. చంద్రబాబుకు ఎవరన్నా భయం లేదు.. మోడీ అన్నా, కేసీఆర్ అన్నా అస్సలు భయం లేదు.. ఆయన నిప్పు.. నిప్పు.. నిప్పు.. కాదంటే తప్పు.. తెగుతుంది చెప్పు..!



మరింత సమాచారం తెలుసుకోండి: