క్రికెటర్ రవీందర్ జడేజా చిక్కుల్లో పడ్డాడు. గుజరాత్ లోని గిర్  అభయారణ్యంలో సింహాలతో సెల్ఫీ తీసుకుని వివాదంలో ఇరుక్కున్నాడు. ఇటీవల  జునాగఢ్ లోని సాసన్  ఆభయారణ్యానికి వెళ్లిన జడేజా అక్కడున్న సింహాలకు కొంచెం దూరంలో ఉండి సెల్ఫీలు తీసుకున్నాడు.

ఈనెల 15న జడేజా తీసుకున్న సెల్ఫీల్లో ఆయన భార్య రీవా కూడా కనిపిస్తోంది. ఇటీవల పర్యాటకులు సెల్ఫీల మోజులో సింహాలకు దగ్గరగా వెళ్లి ప్రమాదకర పరిస్థితులు కొనితెచ్చుకుంటున్నారు. దీంతో ఈనెల 13నే సెల్ఫీల్ని గుజరాత్  అటవీ శాఖ నిషేధించింది.


ఆ మేరకు గుజరాత్ అటవీశాఖ బాగానే ప్రచారం కూడా చేసింది. ఐనా.. రవీందర్ జడేజా ఆ మాటలను లెక్కపెట్టలేదు. అందుకే జడేజా సెల్ఫీల అంశాన్ని గుజరాత్ అటవీశాఖ తీవ్రంగా పరిగణించింది. జడేజా వాహనం నుంచి కిందకు ఎందుకు దిగారు.. సెల్ఫీలు తీసుకోవడంలో సిబ్బంది ఎవరైనా సహకరించారా అన్న అంశాలపై దర్యాప్తుకు ఆదేశించింది.

ఈ మొత్తం ఇష్యూపై  మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా గిర్  అభయారణ్యంలో సింహాలతో సెల్ఫీలు తీసుకున్నవారు... 1971నాటి వన్యమృగ సంరక్షణ చట్టం ప్రకారం శిక్షార్హులని అధికారులు చెబుతున్నారు. మరి రవీందర్ జడేజా ఈ చిక్కునుంచి ఎలా బయటపడతాడో మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: