కలసి ఉన్నా.. విడిపోయి ఉన్నా తెలుగు జాతి గొప్పదనం మాత్రం ఎనలేనిది.. ఇది చరిత్ర చాటుతున్న సత్యం. ఉమ్మడి మద్రాసులోనూ తమిళులపై తెలుగువారిదే పైచేయి. అప్పట్లో చెన్నపట్టణంలో తెలుగువారి సంఖ్యే ఎక్కువ. ఉమ్మడి మద్రాసును పాలించిన తెలుగు ముఖ్యమంత్రులూ ఉన్నారు. కానీ ఉత్తరాది వారికి మాత్రం తెలుగువారంటే ఎప్పుడూ చిన్నచూపే. 

అప్పట్లో తెలుగువారిని ఉత్తరాది వారు మద్రాసీలనే సంభోదించేవారు.. తెలుగు వారు అంటూ ఒకరున్నారన్న స్పృహ వారికి ఉండేది కాదు. అప్పటి దాకా ఎందుకు ఇప్పుడు కూడా ఉత్తరాది వారికి తెలుగు రాష్ట్రాలంటే చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. మోడీ వంటి నాయకులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పేచీలు పెట్టి చోద్యం చూస్తున్న సంగతి తెలిసిందే. 


ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకు మోడీ చేస్తున్న అన్యాయం అంతా ఇంతా కాదు.. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలన్నీ దాదాపుగా తుంగలో తొక్కుతున్నారు. చిన్నాచితకా హామీలు తప్పితే ప్రధాన హామీల జోలికిపోవడం లేదు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా గాల్లోనే వేలాడుతోంది. రాజధాని నిర్మాణం కోసం నిధుల కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. 

అటు తెలంగాణ పరిస్థితీ అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు నిధులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. కానీ స్వతంత్ర్య భారతంలోనే కాదు.. స్వతంత్ర్యానికి ముందు కూడా తెలుగు గొప్పదనం ఘనంగా విలిసిల్లింది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా విదేశీయులతో ప్రశంసలు పొందింది. సుందర తెలుంగు అంటూ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతితో కొనియాడబడింది.

ఇక మహాత్మా గాంధీనే ఆశ్చర్యపరిచిన తెలుగు గొప్పదనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. తెలుగు వారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆందోళన చేస్తున్న సమయంలో – ఇప్పటి ఆంధ్ర ప్రాంతం  ఉమ్మడి మద్రాసు  రాష్ట్రంలో ఉండేది. తెలుగు రాష్ట్ర్రం కోసం తెలుగు వారు గళమెత్తుతున్నారు. ఆ సమయంలో ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘ఉక్కు మనిషి’ సర్ధార్ వల్లభాయి పటేల్, ఆంధ్ర ప్రముఖుడు మహా మేధావి భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా పట్టాభి సీతారామయ్య గారు  ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్య  ను సభ దృష్టికి తీసుకువచ్చారు.. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్..  పట్టాభీ ! నువ్వు ‘ ఆంధ్ర రాష్ట్రం..., ఆంధ్ర రాష్ట్రం..  అని ఎప్పుడూ అంటూ ఉంటావు … అసలు నీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉందయ్యా ? … మీరంతా ‘మద్రాసీ’లు కదా ? అంటూ ఎగతాళిగా మాట్లాడారు.

అప్పుడు వెంటనే పట్టాభి సీతారామయ్య తన జేబులో నుంచి అణా కాసును తీసి  సర్ధార్ జీ ! దీనిపై ‘ ఒక అణా ‘ అని అధికార భాష అయిన ఆంగ్లంలోనూ … జాతీయ భాష అయిన హిందీలోనూ … దేశంలో అత్యధికులు మాట్లాడే బెంగాలీలోనూ … ఆ తర్వాత  ఒక అణా అని తెలుగులోనూ రాసి ఉంది. ఈ నాణెం పై  ‘ తెలుగు భాష ఉంది … కానీ,  గుజరాతీ భాష ఎక్కడా లేదే ?? అంటూ చురక వేశారు.
దాంతో పటేల్ గారు ఆశ్చర్యపోయారు. ఆ మాటలు విన్న గాంధీజీ కూడా చిరునవ్వుతో ఉండిపోయారు. మహాత్మా గాంధీ గారి మాతృభాష కూడా గుజరాతీ భాషే. 




భారత దేశానికి స్వతంత్రం రాక ముందే బ్రిటిష్ ప్రభుత్వం వారు మనలను పరిపాలించే రోజుల్లోనే … తెలుగు భాషకున్న ప్రాచీనతను గొప్పదనాన్ని గుర్తించి, వారు ముద్రించిన నాణెల మీద అధికార భాష ఇంగ్లీషు, జాతీయ భాష హిందీ, బెంగాలీ భాష సరసన తెలుగు భాషకు అవకాశం కల్పించారు. 

అదీ తెలుగు జాతి గొప్పదనం.. తెలుగు భాష తీయదనం.. తెలుగు ముద్ర విశిష్టత. అందుకే మన పిల్లలకు,నేటి తరానికి తెలుగు జాతి, భాష గొప్పదనం గురించి తెలియజేయండి. ఈ పాతకాలం నాటి బ్రిటీష్ నాణేలు చూపండి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని... తెలుగు అభిమానాన్ని పాదుకొల్పండి. వచ్చిండన్నా.. వచ్చాడన్నా.. వరాల తెలుగు ఒకటేనన్నా.. అని పాడండి.. జై తెలుగు.. జైజై తెలుగు అని నినదించండి.



మరింత సమాచారం తెలుసుకోండి: