నగరంలో రోజు రోజుకి మహిళలపై దాడులు, అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మహిళలకు భద్రత లేకుండా పోతుందని నిరూపించడనికి ఈ సంఘటనే నిలువెత్తు సాక్ష్యం అని మహిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.   సాయంత్ర 7:30 లకు  ఆటోలో  ఎక్కిన నిఖిలను అపహరించి అత్యాచారానికి ప్రయత్నించారు ఆటోవాలాలు.  తనధైర్య సాహసాలతో ఆటోలోంచి దూకడంతో ఇప్పుడా యువతి ప్రాణాపాయ పరిస్థితులలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే... గోవా రాష్ట్రానికి చెందిన నిఖిల హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి మాదాపూర్ ప్రాంతంలో షేరింగ్ ఆటో ఎక్కింది. కొంచెం దూరం వెళ్లాక ఆటోలో మిగతావారు దిగిపోయారు.  ఇదే అదనుగా ఆమెను అపహరించాలనుకున్న ఆటో డ్రైవర్, అతని సహాయకుడు గచ్చిబౌలి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా గమనించిన నిఖిల ఆటోలోంచి దూకేసింది. వెంటనే ఆటోవాలాలు తప్పించుకుపోయారు.   నిఖిలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. నిఖిల స్నేహితురాలు సమాచారం మేరకు  పోలీసులు కేసునమోదు చేసి రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు ఫొటోల ఆధారంగా కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. ఫోటోలను బాధితురాలికి చూపించడంతో తనను ఆటోలో కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించిన వారివేనని బాధితురాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత వీఐపీల భద్రతా సిబ్బందిని కుదించి.. రోడ్లపై మహిళల రక్షణకు భద్రతాసిబ్బందిని నియమించాలని సర్వోన్నత న్యాయస్థానం అన్ని రాష్టాల్ర ప్రభుత్వాలను ఆదేశించినప్పటికీ  మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీసుశాఖ  విఫలమైందని ఐద్వా, పీవోడబ్లూ లాంటి మహిళ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: