‘కుక్క పిల్ల - సబ్బు బిళ్ళ – అగ్గిపుల్ల కాదేది కవితకు అనర్హం’ అన్న శ్రీశ్రీ మాటలు  నేటి దేశ పరిస్థితులలో అవినీతికి కాదేది అనర్హం గా మారిపోయాయి. కేంద్ర కేబినెట్, రాష్ర్టాలు, అధికారులు, శాసనసభ్యులు, వ్యాపారాలు, ఆఖరికి క్రీడలు అన్నీ అవినీతిమయమే. ఇందు కలదు.. అందులేదని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందే కలదు.  వ్యాపారాలే చూడండి అవినీతి పొంగి పొర్లుతుంది. మనదేశ రక్షణ రంగం కూడా అవినీతిలో కూరుకుపోయింది. స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచి  ఎన్నిస్కాములో ఆ రంగంలో కూడా. పోలీసు శాఖ సంగతి చెప్పనక్కరే లేదుగా. పైసా లేకుంటే పని అన్నది జరగదు అక్కడ. ఇవన్నీ ఒక ఎత్తు, మొన్నటికి మొన్న గాలి బెయిల్ కేసులో న్యాయవ్యవస్థకు అంటిన మలినం ఒక ఎత్తు. ఈదేశంలో మిగిలిన వున్న ఆఖరి ఆశ న్యాయవ్యవస్థే. అదీ అవినీతి బాట పడితే, ఇక దేశాన్ని ఎవరూ రక్షించలేరు.

 నిన్నమొన్నటి వరకు దేశాన్ని ‘వేలి ముద్రగాళ్లు’ పాలించేవారు వారుమహా అయితే ఓ బదిలీకో, మరో పర్మిట్ కో సిఫార్సు చేసే వారు.  ఎంతోకొంత  తీసుకునేవారు. మరీ అయితే మొహమాటానికి ఎవరికైనా ఉద్యోగం ఇప్పించేవారు. ఈ చదువుకోని వారి వల్ల దేశం ఎంతో నష్టపోతోందని, చదవుకున్న యువకులు దేశసేవకు నడుంకట్టాలని, రాజకీయాల్లోకి రావాలని తరచు ఉపన్యాసాలు వినిపించేవి. జనం నిజమే కాబోలు అనుకున్నారు. ‘ చదువుకున్న వారికి ఓటు వేసారు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వచ్చారు. వట్టి చదువుకున్నవారు మాత్రమే కాదు. వ్యాపారాలు తెలిసినవారు వచ్చారు. దీంతో రాజకీయాలు మారిపోయాయి. ఇప్పుడు బదిలీలు, ఉద్యోగాలు, పర్మిట్ లు లాంటి చిల్లర వ్యవహారాలు రాజకీయ నాయకులకు పట్టవు. అసలు మంత్రి పదవి ఎంచుకోవడమే, తమ వ్యాపారాల అభివృద్దికి అనువైన శాఖను ఎంచుకోవడం ద్వారా అవినీతికి శ్రీకారం చుడుతున్నారు. తమకు చానెళ్లు, టెలికాం కంపెనీలు వుంటే ఆ తరహా శాఖ. పర్యాటక ప్రాజెక్టులు వుంటే అటు వంటి శాఖల పై మొగ్గు. ఇలా ఎవరి ప్రాధ్యాన్యతలు వారివి, అధికారం అడ్డుపెట్టుకుని, కంపెనీలను పుట్టించడం, లంచాలను అధికారికంగా ఎలా మళ్లించడం, ప్రభుత్వ నిధులను కూడా తెలివిగా ఎల్లా కొట్టేయడం, పథకాలకు అనువుగా కంపెనీలు, కంపెనీలకు అనువుగా పథకాలు సృష్టించి, కోట్లకు కోట్లు సంపాదించడం ఇదీ ఇప్పుడు యువ రాజకీయవేత్తల కృషి.

 గడిచిన పదేళ్లలో బయటపడ్డ స్కాములను పరిశీలించండి. వెల్లడైన పేర్లు చూడండి. అరెస్టయినవారిని గమనించండి. అందరూ బాగా చదువుకున్న యువ రాజకీయవేత్తలే. అన్ని కుంభకోణాలు వందలు, వేల కోట్లే. వీరి ముందు నిన్న మొన్నటి మన వేలిముద్ర రాజకీయ నాయకులు ఏం పనికొస్తారు చెప్పండి? మరి దేశాన్ని ఏలే రాజకీయనాయకులు ఇలా వుంటే ప్రజలు వేరే దోవన ఎందుకు వెళ్తారు. అవి నీతికి ప్రజలు కూడా అలవాటు పడిపోయి  రాజకీయనాయకులకు, స్థానిక నేతలకు, అధికారుల అంచెలంచెలుగా పర్సంటేజ్ లు ఇచ్చుకుంటూ వస్తున్నారు. యాభై లక్షలు కడితే కానీ వైద్య విద్య పట్టారాదు. మరి డాక్టరు అవినీతికి పాల్పడకుండా ఎందుకు వుంటారు? యుకెజి చదవాలంటే ఏడాదికి కనీసం ముఫ్పై వేల నుంచి మూడు లక్షలు ఖర్చు. ఇంటర్ కు లక్ష, ఎక్కడి నుంచి తేవాలి లక్షలన్నీ, అందుకే ఎవరికి చిక్కిన చోట వారు అందుకుంటున్నారు. చిట్టచివరకు అవినీతి లేకుండా మనిషి జీవితం గడవలేని ప్రమాదకరమైన అంచుకు మన జీవితాలు చేరిపోతున్నాయి. ఏమిచేయాలో తెలియక అయోమయంలో నేటి సగటు మానవుడు ఉన్నాడు. ఈ భయంకరమైన అవినీతి జాడ్యానికి అంతం ఎప్పుడో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: