దాదాపు మూడేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయాన్ని అప్పటి యూపీఏ సర్కారు తీసుకుంది. అయితే ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. విభజన బిల్లును పార్లమెంటు తలుపులు మూసి.. లైవ్ టెలికాస్ట్ బంద్ చేసి.. దౌర్జన్యంగా ముగించారన్న అపవాదులు ఉన్నాయి. 



లగడపాటి రాజగోపాల్ వంటి నాయకులు పెప్పర్ స్ప్రే చల్లడం వంటి సంచలనాత్మక ఘటనలూ జరిగాయి. ఏది ఏమైనా.. ఎన్ని నిరసనలు వ్యక్తమైనా ఏపీని విభజించేందుకే ఆనాటి కాంగ్రెస్ పార్టీ గట్టి నిర్ణయమే తీసుకుంది. దీనికి అప్పటి ప్రతిపక్షం బీజేపీ కూడా వంతపాడింది. అధికార, విపక్షాలు చేయికలిపితే కానిది ఏముంటుంది. విభజన జరిగిపోయింది. 


ఐతే.. ఈ విభజన అశాస్త్రీయమైనది.. ఇది కోర్టుల్లో నిలవదని కొంతకాలంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు అందుకు బలం చేకూరుస్తూ.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రఘురామ కృష్ణం రాజు, రాయపాటి సాంబశివ రావు సహా 100 మంది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 


ఈ పిటిషన్లను సోమవారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. రాజ్యాంగ విరుద్ధంగా బిల్లులు ఆమోదించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు దీనిపై అఫిడవిట్ దాఖలుచేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లను అన్నింటిని కలిపి ఒకేసారి విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: