హైదరాబాద్ ను విశ్వనగరం గా మారుస్తాం.. ఇది టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మొదట్లో టీఆర్ఎస్ ఇచ్చిన నినాదం. అందుకు అనుగుణంగా కేసీఆర్ సర్కారు ఎన్నో నిర్ణయాలు తీసుకుంది. ఆయన కొడుకు కేటీఆర్ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.


హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చే ప్రయత్నంలో కేసీఆర్ ఇప్పటివరకూ చెప్పింది ఎక్కువ చేసింది తక్కువ అన్న అభిప్రాయం జనంలో ఉంది. కానీ ఆశ్చర్యంగా .. తాజాగా ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో హైదరాబాద్ ప్రపంచంలోనే డైనమిక్ నగరాల జాబితాలో ఐదో స్థానం సంపాదించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏకంగా లండన్ ను మించి ర్యాంకు పొందడం నిజంగా హైదరాబాదీలు గర్వించదగిన విషయమే.


హైదరాబాద్ తో పాటు భారత్‌లోని మిగిలిన నగరాలూ సత్తా చాటాయి. ఇక సాఫ్ట్ వేర్ సిటీ బెంగళూరు అయితే ఏకంగా నెంబర్ 1 పొజిషన్ సొంతం చేసుకుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో ఈ జాబితాను విడుదల చేశారు. మూడు విభాగల్లోని 42 అంశాలపై చేసిన సర్వేలో భారత్‌కు చెందిన 6 నగరాలు తొలి 30లో చోటు దక్కించుకున్నాయి.
జేఎల్ ఎల్ సిటీ మొమెంటమ్ ఇండెక్స్ రూపొందించిన జాబితాలో భారత్‌కు చెందిన 6నగరాలు తొలి 30 నగరాల జాబితాలో నిలిచి చైనాను వెనక్కి నెట్టాయి. టాప్ 10 క్రియాశీలక నగరాల్లో హైదరాబాద్ ఐదో స్థానంలో నిలిచి భారత దేశ ఖ్యాతిని దశదిశలా చాటింది. రెండో స్థానంలో వియత్నాం నగరం హోషీమిన్ సిటీ, మూడో స్థానంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ నిలిచాయి.


షాంఘై నాలుగో స్థానంలో ఉంది. లండన్, ఆస్టిన్ నగరాలు 6, ఏడో స్థానాల్లో ఉన్నట్టు సర్వే తెలిపింది. పుణె 13వ స్థానంలో, చెన్నై 17వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ, ముంబయి 23, 25 స్థానాల్లో నిలవడం విశేషం. మొత్తం 42అంశాల ప్రాతిపదికన 134 నగరాలను పరిశీలించి ఈ నివేదిక రూపొందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: