తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటున్నాడు. తెలంగాణ సర్కారు చేపట్టిన గృహ నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై ఇటీవల రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దమ్ముంటే రేవంత్ రెడ్డి తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. 


అనూహ్యంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విసిరన సవాల్ ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఎనీ సెంటర్.. ఎనీ టైమ్.. బహిరంగ చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి క్లారిటీగా ప్రతి సవాల్ విసిరారు. గృహ నిర్మాణ  శాఖ 17 ప్రైవేట్ నిర్మాణ సంస్థలతో  చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


 తెలంగాణ సర్కారు రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి లేదని చెప్పడం దారుణమన్నారు. ఉన్న భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి... ఇప్పుడు పేదలకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటివరకూ పేదలకు కట్టించిన ఇళ్ళు ఎక్కడున్నాయో చూపిస్తే.. అప్పుడు తాను ప్రభుత్వానికి క్షమాపణ చెప్తానని రేవంత్ రెడ్డి అన్నారు. 



గృహనిర్మాణ సంస్థ ద్వారా ఎంపికైన కాంట్రాక్టుల నుండి 3వేల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వానికి రావాల్సి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. గృహనిర్మాణ సంస్థల నుండి ముడుపులు తీసుకునే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వారికి అనుకూలంగా నడుచుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీంతో కేసీఆర్ కు సంబంధం లేకపోతే.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: