ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు మరో సంచలన పథకానికి శ్రీకారం చుడుతున్నారు. అవినీతిని అరికట్టేందుకు ఆయన ఇప్పుడు టెక్నాలజీ విశ్వరూపాన్ని వాడుకోబోతున్నారు. ఇకపై ఆయన ఒకే ఒక్కడు సినిమాలో ఒక్క రోజు సీఎంగా అర్జున్ చేసిన విన్యాసాలు చేయబోతున్నారు. ప్రభుత్వ అధికారుల అవినీతిపైనా, నిర్లక్ష్యంపైనా ప్రజలు ఫిర్యాదు చేయాలంటే ఒక్క కాల్ చేస్తే చాలు.



దీని కోసం ఏపీ సర్కారు ఓ యాప్ రూపొందించింది. ఆ యాప్ నుంచి ఒక్క సందేశం పంపింతే చాలు.. ఎలాంటి సమస్యకైనా కేవలం అరగంటలోనే పరిష్కారం చూపుతారు. స్పందన కనిపిస్తుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో లంచం అడిగినా.. పనులు నత్తనడకన సాగినా.. అధికారులు వేదిస్తున్నా.. ఈ యాప్ ద్వారా కంప్లయింట్ చేయవచ్చు. నిమిషాల్లో సమస్య పరిష్కారమవుతుందట. 



ఈ విషయాన్ని అనకాపల్లి పర్యటనలో స్వయంగా చంద్రబాబు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 14న యాప్ ప్రారంభిస్తామన్న సీఎం.. ఎక్కడైనా సమస్య ఎదురైతే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదు అందిన అర్థగంటలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

సంబంధిత చిత్రం

ఇప్పటికే ఏపీ ఫించన్లు, రేషన్ సరుకుల పంపిణీలోనూ.. బయో మెట్రిక్ విధానం అవలంభిస్తోంది. ఈ పోస్ యంత్రాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తోంది. క్యాష్ లెస్ ఎకానమీ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఈ యాప్ కనుక సమర్థంగా పనిచేయడం మొదలు పెడితే ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తడం ఖాయం. ప్రజలంటే అధికారులు భయపడే రోజులు రాబోతున్నాయన్నమాట. చూడాలి మరి ఈ యాప్ ఎంత సమర్థంగా పని చేస్తుందో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: