గౌరవనీయులైన శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు,


ఉభయకుశలోపరి. ఈ బహిరంగ లేఖ ఎందుకు రాయవలసి వచ్చిందంటే, మీ గురించి, మీ పార్టీ గురించి, మీ సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలనే ఆకాంక్షతో.  ఒక్కోసారి,  అప్పుడప్పుడు,  నిరంతరం, పదే పదే, మీరు రాజకీయాల గురించి మాట్లాడతారు.  మళ్ళా వెంటనే చాలా కాలం నిశ్శబ్ధం అయిపోతారు. ఒక మీటింగ్ లో మాటాడిన విషయం మరో మీటింగ్ లో దాని కొనసాగింపు ఉండదు. ఏ క్షణంలో, ఏ చిత్తంతో మాట్లాడతారో అర్ధం కాకుండా ఉంది. అసలు మీకు రాజకీయ పరిజ్ఞానం ఉందా?  లేకుంటే నాలాంటి అమాయకపు  ప్రాణి  జ్ఞానానికి  అందనంత  స్థాయిలో రాజకీయ పరిజ్ఞానం మీకు ఉందా? తెలియటం లేదు.


ముఖ్యంగా నాకు బాగా అర్ధమైందేమంటే మీరు ఎవరినైనా ప్రశ్నించి సమాధానం రాబట్టగలరని.  2014 ఎన్నికల్లో ఆంద్రప్రదేశ్ ప్రజలకు తెలుగుదేశం పార్టీకి  ఓటెయ్యమని,  మీరు చెప్పిన వారిని మేము గెలిపిస్తే, వారు  విశ్వనగరం స్థాయిలో అమరావతిని నిర్మిస్థారని, రైతు ఋణమాఫీ చేస్తారని, పోలవరం పూర్తి చేస్తారని, ప్రత్యెక హోదా తెప్పిస్తారని నిజంగా చెప్పాలంటే అన్ని వాగ్ధానాలను ప్రస్థావించటానికి ఇక్కడ స్థలాబావం.


అందుకే కొన్నింటినే ప్రస్తావించటం జరిగింది. అయితే ఇందులో ఏ ఒక్కటీ పూర్తిగాలేదు. దీనికి వత్తాసు పలికిన  భారతీయ జనతా పార్టీ కూడా మొండిచేయి చూపించినట్లే ఉంది.  మీరు తెలుగుదేశం పార్టీని గాని బాజపాని గాని ప్రశ్నించిన దాఖలా లు కనబడటం లేదు. దాదాపు ఎన్నికలై మూడేళ్లు పూర్తవ్వొచ్చాయి. ఆ రాజకీయ పార్టీ మహనగర నిర్మాణం వదిలేసి కొడుకును మంత్రిని చేయటములో, స్వగృహ నిర్మాణములో, వ్యాపారాల్లో సంపదలు పోగేసుకోవటములో మునిగిపోయాయి. పాల వ్యాపారములో హెరిటేజ్ ద్వారా 22 రెట్స్ లాభాలు ఘడించారు లోకేష్. అంటే వేరెవరూ ఇలా ఇంత సంపాదించిన చరిత్ర లేదీ వ్యాపారంలో.  ఇందులో "క్విడ్-ప్రొ-క్వో" ఉండొచ్చు గదా?  - గతం లో మనం జగన్ ను ఇలాగే అన్నాం కదా!  


ప్రశ్నిస్తానన్న మీరు గడబిడగా ఒక మీటింగ్ తిరుపతిలో, మరో మీటింగ్ కాకినాడలో, ఇంకో  మీటింగ్ అనంతపురములో పెట్టేశారు. వీటికి బదులు ఆ రెండు పార్టీలను ప్రశ్నించి వారిని కార్యోన్ముఖులను చేస్తే సరిపోయేదానికి మీరింత తతంగం చేయట మెందుకు? మాకేమీ అర్ధం కాదు.


ఆయనెవరో బాజపా తిక్కలోడు, బాజపా మాజి ఎం.పి.  గారేదో  తెలుపు - నలుపు అంటూ కూస్తే మొత్తం ఉత్తరభారతాన్ని తిట్టిపోసి "యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియా" అంటూ మాట్లాడేశారు. మీకు మానసిక సమతౌల్య స్థితి ఉందా? అనేది అందరికి వచ్చే అనుమానం.


అసలే భారత ఉప ఖండం -  పాకిస్థాన్ ఇండియాగా ముక్కలై సరిహద్దుల దగ్గర ప్రపంచ స్థాయి యుద్ధాలకు దారి తీస్తుంటే మరో విభజనా?  ప్రజలెవరూ హర్షించరు. ఈ కొత్త పితలాటకం పెట్టకండి మీకు  పుణ్యముంటుంది. మీవల్ల మాకు మేలు జరగక పోయినా ఫర్వాలేదు,  గాని మరో కొత్త విభజన దరిద్రాన్ని ప్రజల నెత్తి పై పెట్టకండి రుద్దకండి.  


ఒక 13 జిల్లాల కిచ్చిన వాగ్ధానాలను నెరవేర్పించలేని మీరు మొత్తం దక్షిణ భారతానికి ఏం మేలు చేయగలరు? అమరావతి లో పేదవారి భూములు దోచుకోబడ్డాయి. ఒక్క బడా బాబేవరైనా ఒక సెంటు భూమి కోల్పోయాడా? పోతే నిరుపేదలవే ఎందుకు ప్రభుత్వం స్వాదీనం చేసుకుంటుందో తెలుపగలరా?


ప్రతిపక్ష పార్టీ నుండి శాశనసభ్యులు గోడ దూకెయ్యగానే వారిచేత రాజీనామా చేయించకుండానే వాళ్ళని మంత్రులు చేసిన తీరు  ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం చేయతగిన నైతికమైన పనా ఇది! చేయ తగినదా?  ఆ  శాసన సభాపతి సభామర్యాదలు పాటిస్తున్నాడందామా?  


ఈ కథ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నదేగా? వారిని మీరెందుకు ప్రశ్నించరు? ఈ సభాపతులు, ఈ ముఖ్యమంత్రులు "చట్టములో ఉన్న రంద్రాలను సొరంగాలు చేస్తుంటే"  ప్రశ్నించటం మొదలెట్టలేరా?


దివాకర్ ట్రావెల్స్ బస్ దారుణాన్నెందుకు ప్రశ్నించరు? నేరస్తుడెవరైతే వాణ్ణి శిక్షించేలాగా  చేయరెందుకు ? దీన్ని ఎందుకు ప్రశ్నించరు? మీరు తె దె పా - బా జ పా లకు కొమ్ముకాస్తున్నారా? ప్రజలను మోసం చేయటానికి జనములోకి "జనసేన" పేరుతో దగా చేయబోతున్నారా?


గతములో మీ అన్న ప్రజారాజ్యం పేరుతో ప్రజలని దిక్కూ దివాణం లేకుండా చేశారు. నాడు మీ అన్న దయ వల్ల గెలిచి వైఎసార్ ఆయన కుమారుడు అవినీతి రాజ్యం చేస్తే ఇప్పుడు మీ దయవల్ల  గెలిచి చంద్రబాబు ఆయన కుమారుడు అదేపని చేస్తున్నారు - వాళ్ళని ప్రశ్నించరా?


"ఓటుకు నోటు"  లాంటి బడా బడా స్కాముల్లో స్వయానా మీరు అధికారము లోకి తెచ్చిన ముఖ్యమంత్రే కథానాయకుడైతే  కారణమైతే, పాపాలు  శిశుపాలుని నూరు తప్పుల కుప్పలవుతుంటే     శ్రీకృష్ణునిలా అధికార శిరచ్చేదనం చేయాల్సింది పోయి మీరు మత్తులో తూలుతున్నారా!  ప్రశ్నించండి వాళ్ళని ప్రజల్లో బహిరంగంగా నిలదీయండి ధమ్ముంటే?  


కనీసం మీ ఆప్తమిత్రుడు నరెంద్ర మోడీ చేసిన "పెద్దనోట్ల రద్దు"  నిర్వాకాన్ని ఇంకా ప్రశ్నించ లేదేమి?  ప్రత్యెక హోదా యివ్వని మోడీ - దానికోసం ప్రయత్నించని బాబు మీకు ఆప్తమిత్రులేగా వాళ్ళని ప్రజల మధ్యలో నిగ్గదీయరేమి? 


రెండు దశాబ్దాల్లో పట్టుమని పాతిక సినిమాలు చేయని మీరెంత కష్టజీవులో ప్రజల్లో విజ్ఞులకు తెలుసు. అందు జయాప జయాల ను వెతికితే మీ సిగ్గేపోద్ది సుమా!  అందుకే మీరిప్పటికైనా ప్రజాసేవ చేయదలిస్తే ముందు వాగ్ధానాలిచ్చి మాయమైన రాజకీయ నాయకులను ప్రశ్నించి వారిని దారిలోకి తీసుకురండి.


అది ఋజువుచేసుకొని ప్రజల్లోకి వస్తే మేమంతా మీవెంటే. లేకుంటే నాలుగు సినిమాలు చేసుకొని సుఖంగా బ్రతికేయండి.  "సౌతిండియా -నార్తిండియా"  అనేవి మానెయ్యండి.  అవి మీకెలాగు సాధ్యపడవు.  కావాలంటే దేశ సంపదలోని మన వాటా కేకు కోసం పోరాడవచ్చు కేంద్రంతో, కాని విభజన కోసం కాదు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ను "తెలంగాణా- ఆంధ్ర ప్రదేశ్"  గా విభజించి ఏం పీకాం? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి దయచేసి.   


ఇట్లు

మీ శ్రేయోభిలాషి,

ఒక సాధారణ తెలుగు పౌరుడు

మరింత సమాచారం తెలుసుకోండి: