తెలుగు ఇండస్ట్రీలో నటసార్వభౌముడిగా వెలిగిపోయిన మహానటులు నందమూరి తారక రామారావు.  నటుడిగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించారో..రాజకీయ నాయకుడిగా అంతకన్నా గొప్ప పేరు సంపాదించారు. తెలుగు ప్రజలు ఎన్టీఆర్ ని అన్నా అని ఆప్యాయతతో పిలిచే వారు.  అలాంటి మహానటుడి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. సాంఘిక, పౌరాణిక,జానపద చిత్రాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు.  అంతే కాదు తండ్రి బాటలోనే నడుస్తూ..రాజకీయ రంగ ప్రవేశం కూడా చేశారు.  సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు బాలకృష్ణ.  

అప్పట్లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.  కానీ ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు ఈ రెండింటిని బ్యాలెన్స్ వస్తున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ.   కాకపోతే రాజకీయాల కన్నా సినిమాలకే పెద్ద పీఠ వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడపా దడపా ఎప్పుడో ఒకసారి తప్పించి నియోజకవర్గంపై ఆయన దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణ బలంగా వినిపిస్తోంది.  

తాజాగా బాలకృష్ణకు సినిమాలపై ఉన్నంత శ్రద్ధ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై లేదని, ఫలితంగా సమస్యల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎవరు పరిష్కరిస్తారో తెలియక జనం ఇబ్బందులు పడుతున్నారని..అభివృద్ధిని పూర్తిగా గాలి కొదిలేశారని ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.   వైసీపీ ఆరోపణలను స్థానిక టీడీపీ నాయకులు ఖండించారు. హిందూపురంలో జరుగుతోన్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: