అందుకేనేమో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటుంటారు. మొన్నటి వరకూ పన్నీర్ సెల్వం, పళని స్వామి ఒకే కేబినెట్లో పని చేశారు. ఒకే పార్టీ కోసం పని చేశారు. మొదట్లో జయలలిత మంత్రివర్గంలో వీరిద్దరూ పని చేశారు. ఆ తర్వాత పన్నీర్ సెల్వం సీఎం అయినప్పుడూ ఆయన మంత్రి వర్గంలో పళని స్వామి మంత్రిగా పదవి అనుభవించాడు. 



ఆ తర్వాత జయమరణంతో శశికళ సీఎం అవ్వానుకునే సరికి రాజకీయాలు మారిపోయాయి. అనుకోకుండా జైలు ఊచలు రారమ్మని శశికళను పిలవడంతో ఆమె ఇరకాటంలో పడింది.  పన్నీర్ సెల్వానికి చెక్ పెట్టేందుకు శశికళ పళని స్వామిని అస్త్రంగా ఎంచుకుంది. పన్నీర్ ను సీఎం కుర్చీ నుంచి దింపి పళని స్వామిని అలవోకగా అందులో కూర్చోబెట్టింది. 


సో.. ఇప్పుడు పళనిస్వామి, శశికళ ఒక వర్గం, పన్నీర్ సెల్వం మరో వర్గం. కానీ ఇప్పుడు మరోసారి ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. శశికళ కారాగారవాసం, రెండాకుల గుర్తు కోసం అన్నా డీఎంకేలోని ఇరువర్గాల పోరు అనంతరం.. ఇప్పుడు ఈ రెండు వర్గాలు చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ ఏకీకరణకు సిద్ధమని పన్నీర్‌సెల్వం ప్రతిపాదించగానే అందుకు సై అంటూ పళనిస్వామి వర్గం సిద్దపడింది. 


ఈ మేరకు సోమవారం రాత్రంతా ఇరువర్గాల మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయట. రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకే అమ్మ వర్గానికి చెందిన శశికళ మేనల్లుడు దినకరన్ ఈసీ అధికారికి లంచం ఇచ్చేందుకు యత్నించారన్న ఆరోపణలు వచ్చిన కొద్దిసేపటికే తమిళ రాజకీయం మారిపోయింది. రెండు వర్గాల విలీనంపై శశికళ వర్గం తనతో చర్చలు జరిపేందుకు ముందుకు వస్తుందని పన్నీర్ సెల్వం ప్రకటించారు. ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. ప్రత్యర్థి వర్గం నేత తంబిదురై దాన్ని స్వాగతించారు. 


అన్నాడీఎంకేలో ఎలాంటి చీలిక ఏర్పడలేదని.. అభిప్రాయభేదాలను చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుంటామని ప్రకటించేశారు. జయలలిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వెనకున్న లక్ష్యాల్ని సాధించడం పార్టీ కార్యకర్తల అందరి బాధ్యత అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. శశికళ, దినకరన్ లకు జైలు జీవితం తప్పదని భావించిన నేతలు.. పార్టీని కాపాడుకునేందుకు ఒక్కటవుతున్నారని తెలుస్తోంది. పార్టీ నుంచి వీరు శశికళ, దినకరన్ ను బయటికి పంపినా ఆశ్చర్యపోనవసరం లేదని తమిళ వర్గాలు చెబుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో..!



మరింత సమాచారం తెలుసుకోండి: