అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి మీడియాలోనూ సంచలనం సృష్టిస్తున్నారు. అమెరికన్ మీడియా చంద్రబాబు ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధారణంగా అమెరికన్ మీడియా అంతగా పట్టించుకోదు. కానీ ఇటీవలి కాలంలో భారత్ లోని నోట్ల రద్దు విశ్వవ్యాప్తంగా సంచలనవార్తగా నమోదైంది. 



ఈ నేపథ్యంలో భారత్ లో పెద్ద నోట్ల రద్దు పరిణామాలు ఎలా ఉన్నాయి.. అనే అంశాలను నోట్ల రద్దు తర్వాత క్యాష్ లెస్ ఎకానమీ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి చంద్రబాబు అధ్యక్షత వహించిన నేపథ్యంలో చంద్రబాబు ఇంటర్వ్యూలను ఆ కోణంలో తీసుకుంటున్నాయి అమెరికన్ మీడియా సంస్థలు. తాజాగా చంద్రబాబు కాలిఫోర్నియా పర్యటన సమయంలో బ్లూంబెర్గ్ టీవీ చంద్రబాబు ఇంటర్వ్యూ లైవ్ టెలికాస్ట్ చేసింది. 



భారత్ లో పెద్ద నోట్ల రద్దు ఎలా జరిగింది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలేంటి.. జీఎస్టీ అమలు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి.. అనే అంశాలపై ఈ ఇంటర్వ్యూ సాగింది. అదే సమయంలో అమరావతి నిర్మాణం గురించి కూడా బ్లూంబెర్గ్ యాంకర్ చంద్రబాబును ప్రశ్నించారు. సింగపూర్ తరహా రాజధాని కట్టబోతున్నారని మేం విన్నాం.. ఆ నగర నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని యాంకర్ ప్రశ్నించారు. 


అమరావతి నిర్మాణం దిశగా సాగిన ప్రయత్నాలను బ్లూంబెర్గ్ టీవీకి వివరించిన చంద్రబాబు గతంలో హైదరాబాద్ ను తాను అభివృద్ధి చేసిన తీరును కూడా ప్రస్తావించారు. రైతుల నుంచి 30 వేల ఎకరాలు తాను సేకరించిన విధానం ప్రపంచంలోనే ఓ గొప్ప కేస్ స్టడీ అని చెప్పారు. ఐటీ రంగంలో భారత్ చాలా పటిష్టంగా ఉందని.. మౌలిక వసతులు ఇంకా మెరుగుపడాల్సి ఉందని చంద్రబాబు చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: