ఇండియా టుడే నిర్వహిస్తున్న ‘సౌత్‌ కన్‌క్లేవ్‌ 2018’ లో కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ సదస్సు నిర్వహించిన సీనియర్ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ తో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ కంటే తాము ఎంతో ముందున్నామన్నారు. అసలు తెలంగాణకు, ఆంధ్రాకు పోలికే లేదని.. తమది ఆర్థికంగా మిగులు రాష్ట్రమని చెప్పారు. అంతే కాదు.. ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ తెలంగాణతో పోటీపడలేదని కామెంట్ చేయడం విశేషం. 

CMKCR

అసలు 1956లో తెలంగాణ, ఆంధ్రాలను కలపడమే తప్పని కేసీఆర్ చెప్పుకొచ్చారు. సంస్కృతి, సంప్రదాయాల్లో రెండు రాష్ట్రాల మధ్య చాలా తేడాలున్నాయన్నారు. అన్నిరంగాల్లో తమ రాష్ట్రం ముందుందని.. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తామే నంబర్‌వన్‌ అని కేసీఆర్ అన్నారు. అభివృద్ధిలో గుజరాత్‌ కంటే తెలంగాణ ఏమాత్రం తక్కువ కాదని వాదించారు. తెలంగాణ చిన్న రాష్ట్రం కాదన్న కేసీఆర్ దేశంలో తెలంగాణ కంటే చిన్నవి 16 రాష్ట్రాలున్నాయని తెలిపారు. భౌగోళికంగా బిహార్‌, బెంగాల్‌ కంటే తెలంగాణ పెద్ద రాష్ట్రమని వెల్లడించారు. 



తాము చెప్పినట్టుగా త్వరలోనే దేశంలో అత్యంత ధనిక రాష్ట్రంగా అవతరిస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. నీటిపారుదల రంగంలో అద్భుతాలు చేస్తున్నామని కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయ రంగంలో అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రోల్‌మోడల్‌గా ఉండబోతోందన్నారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల వల్ల రైతు ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది తమ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో గోదాముల సామర్థ్యం 4 లక్షల నుంచి 23 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచామని వివరించారు.

CMKCR1

ఐతే.. కేసీఆర్ కామెంట్లపై విమర్శలూ వస్తున్నాయి. తెలంగాణ గురించి ఎంత గొప్పగానైనా పొగుడుకోవచ్చని కానీ.. ఆంధ్రాను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటున్నారు. తెలంగాణ అభివృద్ధిలో సగభాగం హైదరాబాద్ దేనని.. అది ఆంధ్రావాళ్ల గొప్పదనమేనని గుర్తు చేస్తున్నారు. వడ్డించిన విస్తరిలాంటి హైదరాబాద్  తెలంగాణకు దక్కడం వల్లే తెలంగాణ ధనిక రాష్ట్రంగా మారిందన్న సంగతి గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: