33 ఏళ్ల నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. పార్టీ క‌ష్టకాలంలో ఉన్న స‌మ‌యంలో అండ‌గా నిలిచారు. ఎన్నో ప‌ద‌వులు కూడా అధిరోహించారు. కానీ ఏనాడూ పార్టీ గీసిన గీత దాట‌లేదు. ప‌ద‌వులు ద‌క్కినా ద‌క్కకున్నా అదే క్ర‌మ‌శిక్ష‌ణ‌తోనే కొంత‌కాలం వ‌ర‌కూ ఉన్నారు. కానీ ఒక్క‌సారిగా ఆయ‌న అధినేత‌ను టార్గెట్ చేశారు. గీత దాటి మ‌రీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. మ‌రి ఆయ‌న‌లో ఇంత మార్పున‌కు కార‌ణ‌మేంటి? ఆయ‌నే స్వ‌త‌హాగా ఇలా మాట్లాడుతున్నారా లేక ఎవ‌రైనా వెన‌కుండి ఇలా మాట్లాడిస్తున్నారా? అంద‌రిలోనూ ఇవే సందేహాలు! టీటీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. అయితే వీటి వెనుక మాత్రం టీఆర్ఎస్ అధినేత ఉన్నార‌నే గుస‌గుస‌లు ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 

Image result for motkupalli narasimhulu

టీఆర్ఎస్‌లో టీటీడీపీని విలీనం చేయాల‌ని మోత్కుప‌ల్లి చేసిన‌ వ్యాఖ్య‌లు విన్న‌వారంతా ఒక విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నారు. గ‌తంలో పార్టీని వీడే స‌మ‌యంలో రేవంత్‌రెడ్డి అన్న మాట‌లు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడు రేవంత్ మాట‌ల‌ను కొట్టిపారేసినా ఇప్పుడు మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌ల‌ను తీసిపారేయ‌లేమ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పార్టీని సమాయత్తం చేయాలన్న దృష్టితో ఓవైపు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు చేపట్టిన తరుణంలో.. మోత్కుప‌ల్లి కామెంట్లు టీడీపీ నేత‌ల‌ను కలవరపెడుతున్నాయి. నిన్న మొన్నటి వ‌ర‌కు టీఆర్ఎస్ తో తెలుగుదేశంపార్టీ పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయాన్నివ్యక్తం చేసిన మోత్కుప‌ల్లి.. తాజాగా విలీనం అంశాన్ని లేవ‌నెత్తడం వెనుక రాజకీయ ఎజెండాను ఉందని తెలుగుత‌మ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Image result for ttdp

పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ.. మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేర‌కు గ‌వ‌ర్నర్ ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని భావించిన మోత్కుపల్లికి ఆశాభంగం ఎదురయిందని.. దీంతో అవకాశం వచ్చినపుడల్లా తన అక్కసును ఇలా వెళ్లగక్కుతున్నారని భావిస్తున్నారు. దీనికి తోడు వరుసగా నేతలు వసలబాట పట్టడంతో.. ఇక తెలంగాణలో టీడీపీ కోలుకునే అవకాశం లేదని మోత్కుపల్లి భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఎన్నికల వరకు వేచి చూడకుండా తన దారి తాను చూసు కోవాలనే ఈయన ఇలాంటి స్టాండ్‌ తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. 

Image result for trs

గులాబీ పార్టీతో ఒప్పందంలో భాగంగానే మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశార‌ని టీటీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. మోత్కుప‌ల్లి వ్యాఖ్య‌ల‌ను గులాబీపార్టీ నేతలు కూడా స్వాగతించడ‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ అని చెబుతున్నారు. మోత్కుపల్లి కామెంట్ల వెనుక గులాబీబాస్‌ వ్యూహం ఉన్నట్టు టీ-టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున మోత్కుపల్లికి ఛాన్స్‌ ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఒక వేళ రాజ్యసభకు అవకాశం రాకున్నా.. ప్రభుత్వంలో కీలక పాత్రపోషించే అవకాశం ఉందని అటు గులాబీపార్టీలో కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయ‌ట‌. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే ఇలాంటి వ్య‌వ‌హారం జ‌రిగింద‌ని, ఆయ‌న డైరెక్ష‌న్‌లోనే మోత్కుప‌ల్లి ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని విశ్వసిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: