ఏపీ విభ‌జ‌న అంశాల‌పై పోరాటంలో వైసీపీ కీల‌క‌మైన పాయింట్‌ను లేవ‌నెత్తింది. కేంద్రం ఏపీకి చేస్తున్న అన్య‌యంపై గ‌ళం వినిపిస్తున్న ఏపీ విప‌క్షం వైసీపీ అటు రాజ్య‌స‌భ‌, ఇటు లోక్‌స‌భ‌లోనూ పోరాడుతోంది. అయితే, ఇదే స‌మ‌యంలో ఏపీ అధికార ప‌క్షం టీడీపీ చేస్తున్న ఆందోళ‌న‌పై కొన్ని సందేహాల‌ను లేవనెత్తింది. ముఖ్యంగా కేంద్రంలో మంత్రిగా ఉన్న సుజ‌నా చౌద‌రిని ల‌క్ష్యం చేసుకుని కొన్ని ప్ర‌శ్న‌లు సంధించింది. వీటిని ప‌రిశీలిస్తే.. నిజ‌మే క‌దా అని అనిపించ‌క మాన‌దు. విష‌యంలోకి వెళ్తే.. ఈ నెల 1న కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌పై ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాలు పెల్లుబికాయి. ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన విభ‌జ‌న చ‌ట్టం తాలూకు హామీల‌ను క‌నీసం ప్ర‌స్తావించ‌కుండానే బ‌డ్జెట్‌ను త‌యారు చేయ‌డంపై ప్ర‌జ‌లు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. 


ఈ క్ర‌మంలోనే ప్ర‌జ‌ల వేడి త‌మ‌ను కూడా తాక‌క మాన‌ద‌ని భావించిన సీఎం చంద్ర‌బాబు వెంట‌నే వ్యూహం మార్చుకు న్నారు. కేంద్రంలో మిత్ర ప‌క్షంగా ఉంటూనే ఏపీకి అన్యాయం చేయ‌డంపై ప్ర‌శ్నించాల‌ని ఎంపీల‌ను పురిగొల్పారు. అదేవిధంగా కేంద్రంలోని ఇద్ద‌రు టీడీపీ మంత్రుల్లో సుజ‌నాను కూడా ప్ర‌శ్నించాల‌ని ఆదేశించారు. దీంతో ఆయ‌న కేంద్రంపై త‌న దాడిని పెంచారు. ఈ క్ర‌మంలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో లాబీలోనే వాగ్యుద్ధానికి దిగారు కూడా. అయితే, దీనిపైనే వైసీపీ ప్ర‌ధాన ప్ర‌శ్న సంధించింది. సుజనా చౌదరి ప్రభుత్వంలో ఉన్నారా.. లేదా చెప్పాలన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే మంత్రి పదవికి సుజనా రాజీనామా చేయాలని వైసీపీ ఎంపీ, అధికార ప్ర‌తినిధి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. 


రాజీనామా చేయకుండా సుజ‌నా చౌద‌రి ప్రభుత్వాన్ని ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ఎన్డీఏ సంకీర్ణంలో టీడీపీ కూడా భాగస్వామిగా ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీకి చెందిన నేతలే ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రశ్నించాల్సిన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రానికి న్యాయం జరగదని భావించినప్పుడు మంత్రి పదవులకు రాజీనామా చేయడం ఉత్తమమని సూచించారు. కేవలం తమ స్వార్థం కోసం టీడీపీ డ్రామాలాడుతోందని విమర్శించారు. ఏదేమైనా విజ‌య‌సాయి ప్ర‌శ్న స‌హేతుక‌మే అంటున్నారు విశ్లేష‌కులు కూడా. ప్ర‌భుత్వంలో భాగ‌స్వాములుగా ఉండి.. అదే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఎలా చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గ‌తంలో వాజ్‌పేయి ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన ఓ అవినీతి వ్య‌వ‌హారంపై ప్ర‌శ్నించాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి బావించారు. 


అయితే, ఆమె అప్ప‌టికే ఆ ప్ర‌భుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్ర‌మంలో తాను రైల్వే మంత్రిగా ఉంటూ.. ప్ర‌భుత్వాన్ని ఎలా ప్ర‌శ్నిస్తాన‌ని ఆమె అంటూ.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అనంత‌రం బీజేపీ అధ్య‌క్షుడు బంగారు ల‌క్ష్మ‌ణ్‌ అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఇక‌, యూపీఏ -1లో భాగ‌స్వామిగా ఉన్న వామ‌ప‌క్షాలు.. ప్ర‌భుత్వం అమెరికాతో చేసుకున్న ఒప్పందాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయితే, ప్ర‌భుత్వంలో ఉండి ఇలా విమ‌ర్శించడం త‌గ‌ద‌ని భావించి ప్ర‌భుత్వానికి త‌మ మ‌ద్ద‌తును ఉప‌సంహ‌రించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చి పోరాటం చేశారు. మ‌రి చ‌రిత్ర ఇలా ఉంటే.. టీడీపీ మాత్రం బీజేపీతో అంట‌కాగుతూనే.. కేంద్ర‌పై పోరాటం అంటూ వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం స‌ర్వ‌త్రా విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: