టీడీపీ ఎంపీలు రెచ్చిపోతున్నారు. ఏపీకి జ‌రుగుతున్న అన్యాయంపై ఎట్ట‌కేల‌కు గ‌ళం విప్పిన టీడీపీ పార్ల‌మెంటులో త‌న స‌త్తా చూపుతోంది. రాజ్య‌స‌భ‌లోను, లోక్‌స‌భ‌లోనూ కూడా టీడీపీ ఎంపీలు చెల‌రేగిపోతున్నారు. రాష్ట్రానికి జ‌రిగిన‌, జ‌రుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు అన్ని పార్టీలూ దాదాపు ఏక‌మ‌య్యాయి. అయితే, అజెండా వారికి ఉండ‌డం గ‌మ‌నార్హం. అయితే, ఏ పార్టీకి ఆపార్టీ, ఏ ఎంపీకి ఆ ఎంపీ త‌న‌దైన శైలిలో కేంద్రంపై విరుచుకుప‌డుతున్నారు. కేంద్రం చేస్తాన‌ని హామీ ఇచ్చిన అన్ని అంశాల‌నూ నెర‌వేర్చాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఒకింత ముందంజ‌లో ఉన్న టీడీపీ ఎంపీలు ఎవ‌రికి వారే పోటీ ప‌డి మ‌రీ కేంద్రంపై మాట‌ల యుద్ధం చేస్తున్నారు. 


నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంపై పార్ల‌మెంటులో యుద్ధం చేయడం అంటే ఏమిటో తెలియ‌ని చాలామంది టీడీపీ ఎంపీలు అధినేత చంద్ర‌బాబు ఆదేశిచేస‌రికి.. పార్ల‌మెంటులో గ‌ళం వినిపిస్తున్నారు. అయితే, మ‌న ఎంపీల‌కు భాష స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించింది. ఏదో ఒక‌టి రెండు ముక్క‌ల్లో తేల్చేయాల్సిన స‌బ్జెక్ట్ కాక‌పోవ‌డం, సుదీర్ఘంగా మాట్టాడాల్సిన స‌బ్జెక్ట్ కావ‌డం, మ‌ధ్య‌మ‌ధ్య‌లో కేంద్రం నుంచి ఎదుర‌య్యే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిరావ‌డంతో మ‌న టీడీపీ ఎంపీల‌కు అగ్ని ప‌రీక్ష‌గా మారింది. ఇదిలావుంటే, పార్టీ అధినేత చంద్ర‌బాబు మొత్తం భారాన్ని ఎంపీల‌పైనే పెట్ట‌డం కూడా ప్ర‌ధాన స‌మ‌స్య‌గా వారు ఫీల‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబును మెప్పించేందుకు ఎంపీలు ఎవ‌రికి వారు తంటాలు ప‌డుతున్నారు. 


ఈ క్ర‌మంలోనే లోక్‌స‌భ‌లో రెండు రోజుల కింద‌ట మాట్లాడిన గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్.. కేంద్రానికి చుక్క‌లు చూపించాడు. బీజేపీ నేత‌ల‌ను, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని, ఆర్థిక మంత్రి జైట్లీని క‌డిగిపారేశాడు. మాట్లాడింది 18 నిముషాలే అయినా.. ఓ రికార్డు సృష్టించింది. జాతీయ ప‌త్రిక‌లు సైతం గ‌ల్లా ప్ర‌సంగంలోని కీల‌క అంశాల‌ను ఫ‌స్ట్ పేజీలోకి తీసుకున్నాయి. మ‌రి ఇంత‌లా ప్ర‌సంగించిన గ‌ల్లాపై సొంత పార్టీ ఎంపీలే నొచ్చుకుంటున్నార‌ని స‌మాచారం. దీనికి రీజ‌న్ ఒక్క‌టే. గ‌ల్లా త‌ర్వాత మాట్లాడిన టీడీపీ ఎంపీలు  గ‌ల్లా రేంజ్‌ను అందుకోలేక పోవ‌డ‌మే. తాము ఎంత‌గా మాట్లాడినా గ‌ల్లా స్థాయిలో పార్ల‌మెంటును కుదిపేయ లేక‌పోయామ‌ని నేత‌లు త‌ర్జ‌న‌భ‌ర్జన ప‌డుతున్నారు. టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేష్‌.. తాజాగా రాజ్య‌స‌భ‌లో మాట్లాడాడు. 


మోడీ స‌ర్కారుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. తెలుగు ప్ర‌జ‌ల్ని అవ‌మానించిన కాంగ్రెస్ గ‌తి గ‌త ఎన్నిక‌ల్లో ఏమైందో చూశాం. డిపాజిట్లు కూడా రాకుండా ప్ర‌జ‌లు క‌క్ష తీర్చుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఓపిక ప‌ట్టింది చాలు. ఇక‌.. ఆ రోజులు పోయాయి. విద్యా సంస్థ‌ల‌కు వేల కోట్ల రూపాయిలు విలువ చేసే భూమిని ఉచితంగా ఇస్తే.. ముష్టిగా నిధులు వేస్తున్నారు. గుజ‌రాత్‌.. మ‌హ‌రాష్ట్ర.. క‌ర్ణాట‌క‌కు మెట్రో ప్రాజెక్టుల‌కు భారీగా నిధులు ఇచ్చారు. విశాఖ మెట్రోను మాత్రం మ‌ర్చిపోయారు. మాకు కావాల్సిన ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాల్సిందే. ఏవేవో కార‌ణాలు చెప్పి రైల్వే జోన్ ఏర్పాటు చేయ‌టం లేదు- అంటూ ధ్వ‌జ మెత్తాడు. అయినా కూడా గ‌ల్లా జ‌య‌దేవ్ రేంజ్‌లో ఎవ‌రినీ ఆయ‌న ఆక‌ట్టుకోలేక పోయాడు. దీంతో ఇప్పుడు టీడీపీ ఎంపీల‌కు గ‌ల్లా విష‌యం చ‌ర్చ‌నీయాంశంగా మారింద‌ని తెలుస్తోంది. మ‌రి టీడీపీకి ఓ మంచి మాట‌కారి దొరికాడ‌ని ఆనందించాలా?  లేక ఇలా నొచ్చుకోవాలో? అర్ధం కావ‌డం లేద‌ట‌! 



మరింత సమాచారం తెలుసుకోండి: