మిత్ర ప‌క్షంపై పోరుకు మిత్ర‌ప‌క్షం సిద్ధ‌మైంది. మిత్ర‌త్వాన్ని ప‌క్క‌న‌పెట్టి క‌త్తులు దూసుకునే రోజు వ‌చ్చేసింది. మిత్ర ధ‌ర్మాన్ని పాటించ‌డం లేద‌ని బీజేపీపై టీడీపీ తిరుగుబాటు ప్రారంభించింది. టీడీపీ ఎంపీలు ప్ర‌ధాని మోడీ, కేంద్ర‌మంత్రి అరుణ్ జైట్లీపైకి ప్ర‌శ్న‌ల బాణాలు సంధిస్తున్నారు. ఏపీకి జ‌రిగిన అన్యాయంపై ర‌గిలిపోతున్న ఆంధ్రుల ఆగ్ర‌హాన్ని గమ‌నించిన సీఎం చంద్ర‌బాబు కూడా.. ఎంపీల‌కు పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. పోరు కొన‌సాగించాలని స్ప‌ష్టంచేస్తున్నారు. మిత్ర‌ప‌క్షాలైన బీజేపీ-టీడీపీ మ‌ధ్య పోరు ఎటువంటి ప‌రిస్థితుల‌కు దారితీస్తుందోన‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై పోరాడుతున్నా.. పొత్తు విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 

Image result for chandrababu modi

కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీకి జ‌రిగిన అన్యాయం, కేటాయింపుల్లో చూపిన మొండిచేయిపై ఏపీ ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హ జ్వాల‌లు ర‌గులుతున్నాయి. బీజేపీపై అన్ని వ‌ర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇన్నాళ్లూ మిత్ర ధ‌ర్మం అంటూ వేచిచూసిన నేత‌లు.. ఇప్పుడు పోరు బాట ప‌ట్టారు. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు నెర‌వేర్చాల‌ని ఎంపీలు కోరుతుంటే.. చేస్తాం చూస్తాం అని పాత పాటే పాడుతున్నారు కేంద్రంలోని పెద్ద‌లు. రెండు రోజులుగా ఢిల్లీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు.. రాజ‌కీయంగా కాక పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ ఎంపీల నిర‌స‌న ఉద్ధృతం కావ‌డం.. దుబాయ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ఆస‌క్తి రేపుతున్నాయి. ఇకపై వెన‌క‌డుగు వేసే ప్ర‌స్తక్తే లేద‌నీ, పోరాటం కాన‌సాగించాల్సిందే అని సీఎం చెప్పారు. 

Image result for chandrababu modi

ఆంధ్రాకి సాయం అడిగితే.. కేంద్రం ద‌గ్గ‌ర నిధుల్లేవ‌ని ఆర్థిక‌మంత్రి అరుణ్ జైట్లీ చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. రాష్ట్రాన్ని విభ‌జిస్తున్న‌ప్పుడు ఇలాంటి లెక్క‌లు ఎందుకు మాట్లాడ‌లేద‌ని సీఎం అసంతృప్తి వ్య‌క్తం చేశారు. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చండ‌ని అడుగుతుంటే.. ఇలా లెక్క‌లు చెప్ప‌డ‌మేంటంటూ త‌ప్పుబ‌ట్టారు. కేంద్రం స్పంద‌న‌లో ఏమాత్రం కొత్త‌ద‌నం లేద‌నీ, ఇక‌పై పోరాటాన్ని ఎట్టి ప‌రిస్థితుల్లో ఆపేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. దుబాయ్ నుంచి తిరిగి వ‌చ్చిన వెంట‌నే.. మ‌లిద‌శ పోరాటానికి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని ఎంపీలు స్ప‌ష్టంచేస్తున్నారు. కేంద్రంతో పొత్తు కొనసాగదనే స్ప‌ష్ట‌త వ‌స్తున్న‌ట్టుగానే ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. 

Related image

తెలుగుదేశంతో పొత్తు తెంచుకునే దిశ‌గానే భాజ‌పా వైఖ‌రి ఉంది. ఒక‌వేళ కొన‌సాగించుకోవాల‌న్న ఉద్దేశ‌మే ఉంటే.. ప‌రిస్థితిని శాంతప‌ర‌చే విధంగా చ‌ర్య‌లుండాలి. కానీ, భాజ‌పా నిర్ల‌క్ష్య వైఖ‌రి చూస్తుంటే టీడీపీతో పొత్తు ఉంటే ఎంత‌, పోతే ఎంత అన్న‌ట్టుగానే ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌, టీడీపీ కోణం నుంచి చూసుకున్నా.. భాజ‌పాతో పొత్తు కొన‌సాగుతుంద‌నే సంకేతాలు క‌నిపించ‌డం లేదు. అలాంటి ఉద్దేశం టీడీపీకి ఉన్నా కూడా రాష్ట్రంలో విమ‌ర్శ‌ల‌పాలు కావాల్సి వ‌స్తుంద‌నేది వాస్త‌వం. మ‌లిద‌శ‌లో మంత్రులు కేంద్ర కేబినెట్ నుంచి బ‌య‌ట‌కి రావ‌డం.. ఎంపీల రాజీనామాల వ‌ర‌కూ వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని విశ్లేష‌కుల అంచ‌నా..!  



మరింత సమాచారం తెలుసుకోండి: