గల్ఫ్‌ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం యూఏఈ, ఒమన్‌లలో బిజీబిజీగా గడిపారు. ఉదయం దుబాయ్‌లోని ఒపెరా హౌజ్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగించారు. భారత్‌–యూఏఈ మధ్య శతాబ్దాల నాటి బంధం దృఢమైనదన్నారు. ప్రవాసీల కలల సాకారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. అనంతరం అబుదాబిలో నిర్మించనున్న స్వామినారాయణ్‌ మందిరానికి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు.
PM Narendra Modi Addresses Indians, Launches Temple - Sakshi
ప్రధాని మోదీ తన నాలుగురోజుల పర్యటనలో భాగంగా మస్కట్‌లోని మత్రాహ్ ఏరియాలో ఉన్న 125 ఏళ్ల పురాతన శివాలయాన్ని సందర్శించారు. ఆలయంలో పూజలు చేసిన అనతరం వెలుపలే వేచియున్న భారతీయ సంతతికి చెందిన వారితో ఆయన ముచ్చటించారు. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఈ శివాలయం ఒకటి. ఒమన్ సుల్తాన్ ప్యాలెస్‌కు సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని గుజరాత్‌కు చెందిన వ్యాపార వర్గాలు 125 ఏళ్ల క్రితం నిర్మించారు.
modi
1999లో దీనిని పునరుద్ధరించారు.   ఈ ఆలయంలో ప్రధాన దేవతామూర్తులుగా శ్రీ ఆది మోతీశ్వర్ మహదేవ్, శ్రీ మోతీశ్వర్ మహదేవ్, శ్రీ హనుమాన్‌జీ ఉన్నారు. పండుగలు, ప్రధాన ఉత్సవాల్లో ఈ ఆలయాన్ని 15,000 మందికి పైగా భక్తులు దర్శిస్తుంటారు. కాగా, ఆదివారం నాడు ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సైద్‌తో సమావేశమైన మోదీ పలు అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.

వ్యాపారం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత, రక్షణ, ఆహార భద్రత, ప్రాంతీయ సమస్యల పరంగా ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి వారిద్దరూ చర్చించారు. చర్చల అనంతరం ఇరు దేశాల మధ్య పౌర, వాణిజ్య అంశాల్లో చట్టపరమైన, న్యాయ సహకారంపై ఓ అవగాహన ఒప్పందం సహా ఎనిమిది కీలక ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: