ఆంధ్రా రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. బీజేపీతో కటీఫ్ కు సిద్ధమైన టీడీపీ.. ఏపీకి అన్యాయం జరుగుతోందంటూ ఇప్పటికే జోరుగా పొలిటికల్ డ్రామా మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఈ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తోంది. మిత్రపక్షమే అయినా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదంటూ కేంద్రంపై పోరాటం ప్రారంభించింది. ఇన్నాల్లూ నిద్రపోయినట్టు ప్రవర్తించి.. ఇప్పుడు ఒక్కసారిగా స్ట్రాటజీ మార్చేసింది. 


టీడీపీ మాస్టర్ ప్లాన్ తో మొదట్లో వైసీపీ బిత్తరపోయింది. ఆ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించాలో అర్థంకాని పరిస్థితిలో పడిపోయింది. దీనికి తోడు మంత్రివర్గంలో ఉండి కేంద్రంపై ఎలా పోరాడతారంటూ ఆ పార్టీ చేస్తున్న వాదన ప్రజలకు అంతగా రుచించడం లేదు. అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ వినియోగించుకోవడంలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కీలక సమావేశం ఏర్పాటు చేసి ఈ మొత్తం వ్యవహారంపై చర్చించారు.

ప్రత్యేక హోదాకు బాబు ప్రభుత్వం సమాధి

భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకోవడానికి గాను.. పార్టీ ఎమ్.పిలు, ముఖ్య నేతలు, ప్రాంతీయ సమన్వయకర్తలు తదితరులతో జగన్ తన పాదయాత్ర జరుగుతున్న చోటే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, టిడిపి డబుల్ గేమ్ వంటి అంశాలపై చర్చించారు. టీడీపీ వ్యూహానికి విరుగుడుగా ప్రత్యేక హోదాపై మళ్లీ ఆందోళన బాట పట్టాలని నిర్ణయించింది. 
‘ప్రత్యేక హోదా మన హక్కు-ప్యాకేజితో మోసపోవద్దు’ అనే నినాదంతో మార్చి 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించాలని జగన్ నిర్ణయించారు. 

మార్చి 3న జగన్ పాదయాత్రలో, 5న జంతర్ మంతర్ వద్ద ధర్నా

మార్చి 1న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, 3న ఎంపీల ఢిల్లీ యాత్ర, 5న జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించాలని జగన్ ప్లాన్ చేశారు. మార్చి 5వ తేదీన ‘ప్రత్యేక హోదా మన హక్కు- ప్యాకేజి మాకొద్దు’ అన్న నినాదంతో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, నేతలతో కలసి ధర్నా చేయాలని డిసైడ్ చేశారు. ఐతే.. అటు టీడీపీ కూడా బీజేపీకి మార్చి 5నే డెడ్ లైన్ విధించింది. మళ్లీ పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యేలోపు.. విభజన హామీలు అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది. చేయని పక్షంలో రాజీనామాలకు సైతం సిద్ధపడుతోంది. మరి రాష్ట్రం కోసం పోరాటంలో ఏ పార్టీ పైచేయి సాధిస్తుంది. జనం ఏ పార్టీ పోరాటాన్ని నమ్ముతారన్నది వేచి చూడాలి. మొత్తానికి ఏపీ రాజకీయం రసకందాయంలో పడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: