ఆ మద్య గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మద్య హోరా హోరీ యుద్దమే కొనసాగింది.  అయితే బీజేపీ అత్యధిక సీట్లు సాధించినప్పటికీ కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది.  త్వరలో కర్ణాటకలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ ల మద్య మరోసారి ఎన్నికల యుద్దం జరగబోతుంది. ఇప్పటికే ఇరుపక్ష నాయకులు పరస్పర మాటల యుద్దం కొనసాగిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో కాంగ్రెస్‌ నేతలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యే కుమారుడు మహమ్మద్‌ హ్యారీస్‌ నలపాడ్‌ పబ్‌లో ఓ వ్యక్తిపై దాడి చేసి కలకలం రేపిన విషయం మరువక ముందే..మరో కాంగ్రెస్ నేత ఏకంగా పెట్రోల్ బాటిల్ తో ఓ ప్రభుత్వ కార్యాలయాన్ని కాల్చి వేస్తానంటూ వీరంగం సృష్టించాడు. కేఆర్‌ పురం బ్లాక్‌ మాజీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నారాయణస్వామి ఇటీవల హోరమావులోని బృహత్‌ బెంగళూరు మహానగర పాలిక వార్డ్‌ కార్యాలయంలో పెట్రోల్‌ బాటిల్‌తో హల్‌చల్‌ చేశాడు. కేఆర్‌పురం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్‌ ప్రధాన అనుచరుడైన నారాయణస్వామి వార్డ్‌ కార్యాలయంలో పెట్రోల్‌ చల్లి తగులబెడతానని హెచ్చరించాడు. 

అంతే కాదు  అసిస్టెంట్‌ రెవెన్యూ అధికారి చెంగల్‌ రాయప్పపై కూడా పెట్రోల్‌ చల్లాడు. తన అనుచరుడు తీసుకొచ్చిన భూపత్రాలపై సంతకాలు చేయాలంటూ బెదిరింపులకు దిగాడు...లేదా పెట్రోల్ పోసి చంపేస్తానని హెచ్చరించాడు. హోరమావులోని ఎన్నారై లేఔట్‌ సంబంధించి నారాయణస్వామి భూవివాదంలో ఇరుక్కున్నాడని, ఈ వివాదంలో తమకు అనుకూలంగా సంతకాలు చేయాలంటూ అతను ప్రెటోల్‌ బాటిల్‌తో వచ్చి బెదిరించాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మంగళవారం విడుదల కావడంతో సదరు కాంగ్రెస్‌ నేత తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: