తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారుతున్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఇత‌ర పార్టీల నుంచి భారీ ఎత్తున అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వ‌ల‌స‌లు శ‌ర‌వేగంగా జ‌రిగాయి. ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది. కారు ఓవ‌ర్ లోడ్ అవ్వ‌డంతో ఇప్పుడు అంద‌రి చూపులు కాంగ్రెస్ వైపే ఉన్నాయి. దీంతో ప‌లువురు సీనియ‌ర్ లీడ‌ర్లు సైతం త‌మ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌తో పాటు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ కోసం కాంగ్రెస్‌లోకి జంప్ చేసేస్తున్నారు.


ఈ క్ర‌మంలోనే టీడీపీ-టీఎస్‌ నుంచి మరో ఇద్దరు సీనియర్‌ నాయకులు సైకిల్‌ దిగబోతున్నారా? ఈ నేతలపై కాంగ్రెస్‌ నుంచి ఒత్తిడి వస్తోందా? అంటే.. అవుననే పార్టీ వర్గాల నుంచి సమాధానం వస్తోంది. పాత కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతో పాటు, గజ్వేల్‌కు చెందిన టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాపరెడ్డి వచ్చేనెలలో కాంగ్రెస్‌లో చేరేందుకు భూమిక సిద్ధమైంది. ప్ర‌తాప‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసి సీఎం కేసీఆర్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు.


ఇక అక్క‌డ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన న‌ర్సారెడ్డి మూడో ప్లేస్‌కు ప‌డిపోయారు. ఎన్నిక‌ల త‌ర్వాత నర్సారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఆయనకు రోడ్డు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి దక్కింది. దీంతో, గజ్వేల్‌లో గట్టి నాయకుడి కోసం ఆన్వేషించిన కాంగ్రెస్‌ పార్టీ వంటేరుపై దృష్టి సారించింది. ఇక రేవంత్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ప్ర‌తాప‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌నే ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా కేసీఆర్‌పై పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.


ఇక పాత క‌రీంన‌గ‌ర్ జిల్లా నుంచి టీడీపీలో పెద్ద త‌ల‌కాయ‌గా ఉన్న మ‌రో వ్య‌క్తి కూడా రేపో మాపో కారెక్కేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో టీడీపీకి ప‌ట్టులేకుండా పోయింది. కాస్తో కూస్తో పేరున్న పెద్ద త‌ల‌కాయ‌లు కూడా పార్టీ వీడుతుండ‌డంతో ఇక ఇక్క‌డ టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీలో ఉండే ఛాన్స్ కూడా లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: