పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అనుకుంటున్నాడో ఏమో కానీ ఇప్పుడు సొంత జిల్లా మీద పూర్తి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. తన అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీ సొంత జిల్లా అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో దారుణ‌మైన ప‌రాజ‌యంతో తీవ్ర‌మైన అవ‌మానం మిగిల్చింది. చిరు స్వ‌యంగా ఇదే జిల్లాలో పాల‌కొల్లు నుంచి పోటీ చేసి ఘోరమైన అవ‌మాన‌క‌ర రీతిలో ఓడిపోయారు. నాడు ప్ర‌జారాజ్యంకు ఇంత అవ‌మానం జ‌ర‌గ‌డానికి ఈ జిల్లాలో తాము బాగా న‌మ్ముకున్న నాయకులే అని పవన్ బలంగా నమ్ముతున్నాడు. ఇక అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేస్తారని చంద్రబాబుకి జైకొడితే ఆయ‌న ఏపీకి తీవ్ర‌మైన అన్యాయం చేస్తున్నార‌ని ప‌వ‌న్ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.


ఇక గుంటూరులో పార్టీ ఆవిర్భావ స‌భ‌లో జనసేనాని ఎత్తిచూపిన  అంశాలను చూసుకుంటే...   ఆయన ప్రధానంగా టార్గెట్‌ చేసుకుంది పశ్చిమ గోదావరి జిల్లా నేతలనే. ఆ జిల్లా ప్రజాప్రతినిధులు అనేక అక్రమాలకు పాల్పడుతూ ప్రజలను దోచుకుంటున్నారని బహిరంగంగా విమర్శించాడు. అంతే కాకుండా ఏపీకి ఎంతో కీలకమైన అంశాలతో పాటు ఇసుక మాఫియా, తుందూరు మెగా ఆక్వాఫ్యాక్టరీ గొడవ, ఎమ్మార్వోపై దాడి, సమాజ సేవ చేసే డాక్టర్ భూమి కబ్జా, పోరాటాలు చేసే నాయకుల అరెస్టులు, అలాగే  పోలవరం కూడా ఆ జిల్లాతోనే ముడిపడి ఉండటంతో పవన్ పశ్చిమగోదావరినే తొలి టార్గెట్‌గా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.


అలాగే ఇసుక అక్రమాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిపై దాడిచేస్తే ఎందుకు స్పందించలేపోయారని జనసేన ఆవిర్భావ సభలో పవన్ సీఎంని ప్రశ్నించే స్థాయికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారం వెళ్లింది.  భీమవరం సమీపంలో ఆక్వాఫుడ్ ఫ్యాక్టరీ వద్దంటూ తుందుర్రు పరిసరాల్లోని గ్రామాల ప్రజలు నాలుగేళ్లుగా ఆందోళనలు చేస్తుంటే… అరెస్టులతో వారిని అణగదొక్కే ప్రయత్నం చేయడాన్ని కూడా పవన్ తప్పుపడుతున్నారు. ప‌వ‌న్ ఈ స‌భ‌కు ప్ర‌త్యేకంగా తుందుర్రు బాధితుల‌ను పిలిపించుకుని మ‌రీ వారిని స్టేజ్ ఎక్కించుకున్నారు.


అదేవిధంగా గత ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాలో ఎదురు  లేకుండా మొత్తం అన్ని స్థానాలను దక్కించుకోవడం, ఈ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండడంతో ఆ కంచుకోటను బద్దలగొట్టాలని పవన్ పావులుకదుపుతున్నట్టు సమాచారం. 2009 ఎన్నిక‌ల్లో త‌న అన్న స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ ఎఫెక్ట్‌తో ప‌శ్చిమ‌లో టీడీపీ ఘోరంగా దెబ్బ‌తింది. చాలా జిల్లాల్లో పార్టీ మూడో స్థానానికి ప‌డిపోయింది.

ఇప్పుడు తాను జ‌న‌సేన నుంచి ఒంట‌రిగా పోటీ చేస్తుండ‌డంతో ఇక్క‌డ టీడీపీని ప్ర‌ధానంగా టార్గెట్ చేసుకున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. నాడు త‌న అన్న ప్రజారాజ్యం నుంచి పోటీ చేసినపుడు చిరంజీవిని ఓడించిన జిల్లా కావడంతో ప‌వ‌న్ ప‌శ్చిమ విష‌యంలో చాలా బాగా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఇక ఈ జిల్లాల్లో ఆరేడు సీట్ల‌లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను రంగంలోకి దింపే అంశంపై కూడా ప‌వ‌న్ ఆలోచ‌న చేస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: