ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ ప‌రిస్థితి రోజురోజుకూ ద‌య‌నీయంగా మారుతోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రోజుకో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఎన్నిక‌ల స‌మీపిస్తున్న త‌రుణంలో జిల్లాలోని ప‌లువురు ఎమ్మెల్యేల వ్య‌వ‌హార‌శైలితో పార్టీకి తీవ్రన‌ష్టం జ‌రుగుతుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లో చర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో విప‌క్ష నేత‌లు కూడా విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. అధికార పార్టీని ఇర‌కాటంలో పెట్టేందుకు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే సీఎం కేసీఆర్ క్షేత్ర‌స్థాయిలో నిఘా వర్గాల ద్వారా వాస్త‌వాల‌ను తెలుసుకుంటున్న‌ట్లు స‌మాచారం. 

Image result for koppula eshwar

జిల్లాకు చెందిన ప్ర‌భుత్వ విప్‌, మ‌రో ఎమ్మెల్యేపై రిపోర్టు ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ చేతిలో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. సిట్టింగుల‌కే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని చెబుతున్న కేసీఆర్ ఈ వివాదాస్ప‌ద నేత‌ల విష‌యం ఎలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు అంద‌రిలో ఆస‌క్తిని రేపుతోంది. ధ‌ర్మ‌పురం ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ వీఫ్‌విప్ కొప్పుల ఈశ్వ‌ర్ ఈ మ‌ధ్య భూవివాదంలో చిక్కుకున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 52 ఎక‌రాల‌ను, పోలీస్ స‌ర్కిల్ ఇన్‌స్పెక్ట‌ర్‌కు చెందిన మూడు గుంటల‌ భూమిని క‌బ్జా చేసి, త‌న భార్య పేరుమీద రిజిస్ట‌ర్ చేయించుకోవ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఇప్పుడీ అంశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. 

Image result for congress

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. ఇలాంటి ప‌రిణామాల‌ను విప‌క్ష కాంగ్రెస్ నేత‌లు త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకుని అధికార పార్టీని దెబ్బ‌తీసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కొప్పుల ఈశ్వ‌ర్ లాంటి సీనియ‌ర్ మీద ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు రావ‌డంతో అధికార పార్టీ విల‌విల్లాడుతోంది. ఇప్ప‌టికే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన ప్ర‌జాచైత‌న్య యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా నూత‌నోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. 

Image result for kcr

ఇక రాష్ట్రంలోనే వివాదాస్ప‌ద ఎమ్మెల్యేగా ముద్ర‌ప‌డిన మంథ‌ని ఎమ్మెల్యే పుట్ట మ‌ధు వ్య‌వ‌హార‌శైలి మ‌రోసారి వివాదాస్ప‌దంగా మారింది. భ‌ర్త లేని ఓ ఒంట‌రి మ‌హిళ‌ను కిడ్నాప్ చేసి, లైంగికంగా వేధించి, గ‌ర్భ‌వ‌తిని చేసిన పుట్ట‌మ‌ధు అనుచ‌రుడు, అధికార పార్టీ బొగ్గుగ‌ని కార్మిక సంఘం నేత సుంక‌రి ప్ర‌తాప్‌కు అండ‌గా నిలిచి కేసు న‌మోదు కాకుండా అడ్డుకున్నార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విష‌యంపై బాధిత మ‌హిళ కోర్టును ఆశ్ర‌యించ‌డంతో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. 

Image result for ktr

ఇప్ప‌టికే పుట్టా మ‌ధు తీరుపై కేసీఆర్ నుంచి కేటీఆర్ వ‌ర‌కు ఎన్నోసార్లు వార్నింగ్‌లు ఇచ్చారు. ఆయ‌న వ‌సూళ్ల దందా ఇప్ప‌ట‌కీ ఆగ‌లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో నీకు టిక్కెట్ కావాలా ? వ‌ద్దా ? అని తేల్చుకోమ‌ని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చినా మ‌ధు తీరులో మాత్రం మార్పు రావ‌డం లేదు. ఈ విష‌యంలో ఇటు ఎమ్మెల్యేపై, అటు స్థానిక పోలీసు అధికారుల వైఖ‌రిపై సీఎం కేసీఆర్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ ప‌రిణామాలతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వివాదాస్ప‌ద ఎమ్మెల్యేల‌కు టికెట్లు ద‌క్క‌వ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. రానున్న రోజుల్లో వీరిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలిమ‌రి.



మరింత సమాచారం తెలుసుకోండి: