అనంత‌పురం.. తిరుప‌తి.. ఇక ఇప్పుడు మ‌రో నియోజ‌క‌వ‌ర్గం!! ఏమిటి ఇది అనుకుంటున్నారా? అదేనండీ.. జ‌న‌సేనాని పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల జాబితా! అవును నిజ‌మే. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన పోటీచేస్తుంద‌ని ప్ర‌క‌టించేశాడు గానీ.. ఇంత‌కీ తాను ఎక్క‌డి నుంచి పోటీచేస్తాడో మాత్రం చెప్పకుండా స‌స్పెన్స్ కొన‌సాగిస్తున్నాడు ప‌వ‌న్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌! అటు రాజ‌కీయ పార్టీల‌కే కాదు ఇటు ప్ర‌జ‌ల‌కు కూడా దీనిపై ఒక స్ప‌ష్టత రావ‌డం లేదు. తాను క‌రువు సీమ అయిన అనంత‌పురం నుంచి పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇది జ‌రిగి మూడేళ్లు దాటిపోయింది.. ఇప్పుడు త‌న అన్నను రాజ‌కీయంగా తొలి మెట్టు ఎక్కేలా చేసిన ఆధ్యాత్మిక న‌గ‌రి చిత్తూరు జిల్లా తిరుప‌తి నుంచి బ‌రిలోకి దిగ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జోరందుకుంది. ఇక ఇది కూడా ప‌క్క‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు మ‌రో నియోజ‌క‌వ‌ర్గం పేరు వినిపిస్తోంది. అదే కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ‌.!! 

Image result for janasena

2019 ఎన్నిక‌లు జ‌న‌సేన‌కు, ప‌వ‌న్‌కు అత్యంత కీల‌కం. ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతుండ‌ట‌మేగాక 175 స్థానాల్లోనూ జ‌న‌సేన పోటీకి దిగుతుండ‌టం ఇక్క‌డ మ‌రో కీల‌క‌మైన అంశం. ఈ నేప‌థ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ప‌వ‌న్‌. ఇప్ప‌టికే పార్టీని సంస్థాగ‌తంగా నిర్మించేందుకు వ్యూహాలు ర‌చిస్తూనే.. వ్యూహ‌క‌ర్త‌ను కూడా నియమించుకుని ఎన్నిక‌ల స‌మ‌రంలోకి దూక‌బోతున్నాడు. అయితే అంద‌రిలోనూ ఇప్పుడు ఒకే ఒక్క ప్ర‌శ్న వినిపిస్తోంది. ప‌వ‌న్ ఎక్క‌డి నుంచి పోటీచేస్తాడనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మిగిలిపోయింది. ఇప్ప‌టికే రెండు నియోజ‌క‌వర్గాల పేర్లు వినిపిస్తున్నాయి.   అనంత‌పురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు కానీ.. పోటీ చేస్తాడో లేదో తెలియదు. అలా పోటీ చేస్తాడో లేదో తెలియని పవన్ పోటీ గురించి నియోజకవర్గాల పేర్లు అయితే మారుతున్నాయి. 

Image result for janasena

అనంతపురం నుంచి అంటే.. అనంతపురం నియోజకవర్గం నుంచినా లేక జిల్లాలోని ఏదేనీ నియోజకవర్గం నుంచినా? అనేది అప్పట్లో పవన్ చెప్పలేదు. అనంతపురం నుంచి.. అన్నాడంతే. ఇది ప్రకటించి మూడేళ్లు గడిచిపోయింది. పవన్ దానిపై మళ్లీ స్పందించలేదు. ఇక మ‌ధ్య‌లో తిరుప‌తి పేరు కూడా వినిపిస్తోంది. ప‌వ‌న్ అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి తిరుప‌తి, పాల‌కొల్లు నుంచి పోటీచేయ‌గా.. సొంత జిల్లా ప్ర‌జ‌లు ఆయ‌న్ను ఓడించ‌గా.. తిరుప‌తి ప్ర‌జ‌లు ఆయ‌న్ను అక్కున చేర్చుకున్నారు. దీంతో పాటు ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గ ప్ర‌జ‌లు కూడా ఇక్క‌డ ఎక్కువ‌గా ఉండ‌టంతో తిరుప‌తి నుంచి కూడా బ‌రిలోకి దిగుతార‌నే ప్ర‌చారం జోరుగానే జ‌రుగుతోంది. ఇదిలా ఉండగానే టీడీపీ కంచుకోట అయిన కృష్ణా జిల్లా నుంచి ప‌వ‌న్ పోటీచేస్తాడ‌నే వార్త పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో చ‌క్కెర్లు కొడుతోంది. 

Related image

వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి పోటీ చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ ఆలోచన చేస్తున్నారని ఆ జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జ్‌ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణారావు మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కాగా, అవనిగడ్డలో ప్రస్తుతం తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యేగా మండలి బుద్ధ ప్రసాద్ ఉన్నారు. ఈయన స్వల్ప మెజారిటీతో గత ఎన్నికల్లో గెలిచాడు. 2009ఎన్నికల్లో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ ను దెబ్బతీసింది. త్రిముఖ పోటీలో నాటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మండలి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి 37వేల ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలిచాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: