క‌ర్నాట‌క ఎన్నిక‌లు ముగిశాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నాటికి ఇక్క‌డ పోటీ చేసి.. నువ్వా నేనా అనే రేంజ్‌లో పోరాడిన కాంగ్రెస్‌-బీజేపీల్లో ఎవ‌రు హీరో.. ఎవ‌రు జీరో అన్న విష‌యం స్ప‌ష్ట‌మై పోనుంది. అయితే, ఈలోగానే రాష్ట్రం స‌హా దేశాన్ని ఆశ్చ‌ర్య ప‌రిచే విధంగా ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. ఇక్క‌డ ఏ పార్టీకీ పూర్తిస్థాయి మెజారిటీ రాద‌ని తేల్చేశాయి. అంతేకాదు, అధికార కాంగ్రెస్ క‌న్నా నాలుగు స్థానాలు విప‌క్షం బీజేపీ కైవసం చేసుకుంటుంద‌ని కూడా వెల్ల‌డించాయి. అయిన‌ప్ప‌టికీ.. ఈ రెండు పార్టీల్లో దేనికీ పూర్తిస్థాయిలో మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, ఏదోఒక పార్టీతో జ‌ట్టుక‌ట్టి జై కొట్టి అధికారంలోకి రావాల్సిన ప‌రిస్థితే ఉంద‌ని తెలిపాయి. 

Image result for karnataka elections

ఈ క్ర‌మంలో ఇక్క‌డ ఇండిపెండె్ంట్లు గా పోటీ చేసి.. గెలుపు ఖాయం అనుకుంటున్న వారికి, అదేస‌మ‌యంలో ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌కు కూడా ప్రాధాన్యం పెరిగిపోయింది. అధికారంలోకి వ‌చ్చే పార్టీ జాత‌కాన్ని నిర్ణ‌యించేది అటు ఇండిపెండెంట్లు, ఇటు జేడీఎస్ మాత్ర‌మేన‌ని తేలిపోయింది. ప్ర‌ధానంగా 40 స్థానాల్లో ఖ‌చ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతుంద‌ని భావిస్తున్న మాజీ ప్ర‌ధాని దేవె గౌడ నేతృత్వంలోని జేడీఎస్ ఏ పార్టీకి మ‌ద్ద‌తిస్తే.. ఆ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని ఊహాగానాలు ఊపందుకున్నాయి.  ఈ క్ర‌మంలో జేడీఎస్‌ను మ‌చ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ స‌హా బీజేపీలు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. 


ఇక‌, జేడీఎస్ నుంచి సీఎం అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కుమార‌స్వామి.. ఈ ప‌రిణామాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని, కింగ్ మేక‌ర్‌గా అవ‌త‌రించాల‌ని చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లడం మరింత ఆసక్తిని రేపుతో్ంది.  అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన  కొద్ది గంటలకే కుమారస్వామి సింగపూర్‌ వెళ్లిపోయారు. పార్టీ తదుపరి కార్యాచరణపై చర్చలు జరిపేందుకే ఆయన సింగపూర్‌ వెళ్లినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. 
‘బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన నేతలు కుమారస్వామి, దేవే గౌడతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. వారితో చర్చలు జరిపేందుకే కుమారస్వామి సింగపూర్‌ వెళ్లి ఉంటారు. ఇక్కడే ఉంటే మీడియాకు తెలిసే అవకాశముంది కదా’ అని కుమారుస్వామి సన్నిహితుడొకరు చెప్పారు. అయితే సాధారణ వైద్య పరీక్షల నిమిత్తమే ఆయన సింగపూర్‌ వెళ్లినట్లు జేడీ(ఎస్‌) వర్గాలు వెల్లడించాయి. సోమవారం రాత్రికి ఆయన బెంగళూరుకు చేరుకుంటారని పేర్కొన్నాయి. 


ఏది ఏమైనా తాజా పరిస్థితుల్లో ఆయన సింగపూర్‌ ప్రయాణం మరింత ఉత్కంఠకు తెరలేపింది. కర్ణాటకలో మొత్తం 224 నియోజకవర్గాలు కాగా.. 222 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఏ పార్టీకైనా మెజారిటీ స్థానాలు 113 కాస్త తక్కువగా వస్తే... అప్పుడు స్వతంత్రులు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అదేస‌మ‌యంలో జేడీఎస్ ప్ర‌ధాన ప‌క్షంగా మ‌ద్దతిస్తే త‌ప్ప‌.. ఎవ‌రికీ అధికారం అందే ఛాన్స్ లేదు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: