అంద‌రూ ఊహించిన‌ట్లుగానే క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హంగ్ ఏర్ప‌డుతోంది. ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అయితే కాంగ్రెస్‌, బీజేపీలు పోటీపోటీగా సీట్లు సాధించినా ప్ర‌భుత్వం ఏర్పాటుకు జేడీఎస్ మ‌ద్ద‌తు తీసుకోవాల్సిన అనివార్య ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. తామే కింగ్‌మేక‌ర్ అవుతామంటూ ముందునుంచీ చెబుతున్న జేడీఎస్ కీల‌కంగా మారుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దేవ‌గౌడ‌కు కాల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం జేడీఎస్‌, కాంగ్రెస్ నాయ‌కులు గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్నారు.

Image result for karnataka elections 2018

అయితే జేడీఎస్ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామికే మంత్రి ప‌ద‌వి ఇస్తామని సోనియా ఇప్ప‌టికే చెప్పార‌ని తెలుస్తోంది. అందివ‌చ్చిన అవ‌కావాన్ని వాడుకుని ముఖ్య‌మంత్రి ప‌ద‌వి చేప‌ట్టి జేడీఎస్ భ‌విష్య‌త్‌కు భ‌రోసా ఇచ్చేందుకు ఆయ‌న పావులుక‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 78స్థానాల్లో కాంగ్రెస్‌, 104 స్థానాల్లో బీజేపీ, సుమారు 40స్థానాల్లో జేడీఎస్ ఆధిక్యంలో కొన‌సాగుతున్నాయి. 


ఇప్ప‌టికే బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. గోవా, మణిపూర్‌ అనుభవాలు పునరావృతం కాకుండా పావులు కదిపేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు గులాం నబీ ఆజాద్, అశోక్ గెహ్లాట్ బెంగళూరు చేరుకున్నారు. ఎన్నిక‌ల‌ ఫలితాల స‌ర‌ళిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిశీలిస్తూ ఇప్ప‌టికే జేడీఎస్ నేత‌ల‌తో మంత‌నాలు మొద‌లుపెట్టారు. జేడీఎస్‌తో ఇత‌రుల‌తో మంత‌నాలు జ‌రిపి ఎలాగైనా అధికారం చేప‌ట్టేందుకు పావులు క‌దుపుతున్నారు. అయితే ఆజాద్‌కు జేడీఎస్ అధినేత దేవేగౌడ‌తో సన్నిహత సంబంధాలు ఉండటం కూడా కాంగ్రెస్‌కు క‌లిసొచ్చే అంశంగా క‌నిపిస్తోంది. 


ఇక ఎలాగైనా బీజేపీ గ‌ద్దెనెక్క‌కుండా ఉండేందుకు ఏకంగా సోనియా రంగంలోకి దిగి జేడీఎస్‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ చేయ‌డంతో రాజ‌కీయం ర‌స‌కందాయంలో ప‌డింది. ఈ ఆఫ‌ర్‌కు దేవ‌గౌడ కూడా ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. నిజానికి క‌ర్ణాట‌క ఎన్నిక‌లు కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌ల‌కు కీల‌కంగా మారాయి. బీజేపీని అడ్డుకుని వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు మార్గం సుగ‌మం చేసుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నం చేసింది. ఇదే స‌మయంలో క‌ర్ణాట‌క‌లో గెలిచి ద‌క్షిణాదిన పాగా వేయాల‌ని బీజేపీ చూస్తోంది. 


ఇక ఈ ఎన్నిక‌ల్లో ఉనికి కోల్పోతే జేడీఎస్ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంగా మార‌డం ఖాయం. ఈ నేప‌థ్యంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జేడీఎస్ కింగ్‌మేక‌ర్ పాత్ర నుంచి కింగ్ అయ్యే అవ‌కాశాల‌ను కుమార‌స్వామి అందిపుచ్చుకుంటార‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. అయితే అధికారం పీఠాన్ని అధిరోహించ‌డం కంటే.. జేడీఎస్ కోరిక‌ల‌న్నీ తీర్చి, బీజేపీని అడ్డుకోవ‌డ‌మే ధ్యేయంగా కాంగ్రెస్ నేత‌లు మంత‌నాలు సాగిన‌ట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: