బీజేపీకి మిత్రులంద‌రూ దూర‌మ‌వుతున్న వేళ‌.. ఊహించ‌ని ఎదురు దెబ్బ త‌గిలింది. క‌శ్మీర్‌లో సంకీర్ణ ప్ర‌భుత్వానికి పీడీపీ గుడ్‌బై చెప్పేసింది. దీంతో చ‌ల్ల‌ని కశ్మీర్ లోయ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. బీజేపీ-పీడీపీ మ‌ధ్య స‌త్సంబంధాలు బ‌ల‌ప‌డేలా చేయ‌డంలో రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న రాంమాధ‌వ్ విఫ‌ల‌య్యార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. పీడీపీ-బీజేపీ బంధానికి వ‌చ్చిన ముప్పు ఏమీ లేద‌ని ఆయ‌న చెబుతుండ‌గానే.. పొత్తు చిత్తవ‌డంతో అంతా ఆయ‌న వైపే చూస్తున్నారు. పార్టీ అంతర్గత రాజకీయాలే కశ్మీరులో ఆయన ప్రయోగానికి గండి కొట్టాయని కొందరంటుంటే, పీడీపీ సర్కారుతో రాంమాధవ్‌ మెతకవైఖరి దేశవ్యాప్తంగా పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీస్తుందనే భయంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన మరోవైపు వినిపిస్తోంది. మొత్తానికి రాంమాధ‌వ్ దూకుడికి కావాల‌నే క‌ళ్లెం వేశార‌నే చ‌ర్చ బీజేపీలో మొద‌లైంది. 

Image result for pdp modi

కర్ణాటకలో ఫలితాలు పూర్తిగా వెలువడకముందే `చంద్రబాబు పని అయిపోయింది, దక్షిణాదిన బీజేపీ దండయాత్ర మొదలవుతుంది` అని రాంమాధవ్‌ ట్వీట్‌ చేశారు. చివరకు కర్ణాటకలోనే పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు ఆయ‌న‌ ఇన్‌ఛార్జిగా ఉన్న జమ్ము కాశ్మీర్‌లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని బీజేపీయే స్వయంగా కూల్చేసుకోవ‌డం స‌ర్వ‌త్రా చర్చ‌నీయాంశంగా మారింది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న రాం మాధ‌వ్ అన‌తి కాలంలోనే ఎంతో పేరు సంపాదించారు. అమిత్‌షా తర్వాత పార్టీలో విజయం ఫార్ములాను ఔపోసన పట్టార‌ని అంతా ప్ర‌శంసించారు. ఆయన చొరవతోనే కశ్మీరులో ఉత్తర, దక్షిణ ధ్రువాలుగా పేరొందిన పీడీపీ-బీజేపీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఆయ‌న వైఖ‌రితోనే ఈ రెండు పార్టీల మ‌ధ్య దూరం పెరిగిందంటున్నారు విశ్లేష‌కులు. 

Image result for bjp

సంకీర్ణ సర్కారును వదిలించుకోవాలన్న నిర్ణయాన్ని ప్ర‌ధాని మోడీ- జాతీయాధ్య‌క్షుడు అమిత్‌షాలు రాష్ట్ర వ్య‌వ‌హారాలు ప‌రిశీలిస్తున్న‌ రాంమాధవ్‌ను సంప్రదించే చేశారా? నిర్ణయం తీసుకున్న తర్వాత చెప్పారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాంమాధవ్‌ మొదటి నుంచీ పీడీపీ సర్కారుకు అండగా నిలిచారు. దేశంలో ఒక్క కశ్మీరులోనే జాతీయ పతాకానికి అవమానం జరగలేదని, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జాతీయ పతాకానికి ఆహ్వానం కూడా లభించదన్నారు. రాంమాధవ్‌ ఇప్పుడా పొగడ్తల భాషకు స్వస్తి పలికారు. మోడీ-అమిత్‌షాల వైఖరికి అనుగుణంగా మాట్లాడడం తప్ప ఆయనకు మరో దారి లేకుండా పోయింది. జమ్ము కశ్మీర్‌ ఇన్‌చార్జిగా రాంమాధవ్‌ తెలివిగానే వ్యవహరించినా కేంద్రంలోని సర్కారు పొంతనలేని విధానాలు ఆయనకు ఇబ్బంది తెచ్చిపెట్టాయ‌ని గుర్తుచేస్తున్నారు. 

Image result for ram madhav

రాంమాధవ్‌ పూనికతోనే జమ్ము కాశ్మీర్‌లో మిలిటెంట్లకూ, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరించేందుకు 2017 అక్టోబర్‌ 25న ఐబీ మాజీ డైరెక్టర్‌ దినేశ్‌ శర్మను నియమించారు. కాశ్మీర్‌లో హురియత్‌తో సహా అన్ని వర్గాలతో మాట్లాడడానికి ప్రభుత్వం చొరవ తీసుకుందని, రాష్ట్రం పట్ల తమ నిజాయితీకి ఇది నిదర్శనమని రాంమాధవ్‌ ప్రకటించారు. అయితే పాకిస్తాన్‌తో మోడీ స‌త్సంబంధాలు నెర‌ప‌డం రాం మాధ‌వ్‌ను ఇబ్బందుల‌కు గురిచేసింది. తన ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్‌ను పిలిచి, ఆయన మనుమరాలి వివాహానికి వెళ్లిన మోడీ.. మరోవైపు కాశ్మీర్‌లో సైనిక చర్యలను ఉద్ధృతం చేశారు. మోదీ సర్కారు వైఫల్యాలను రాంమాధవ్‌పై రుద్దే ప్రయత్నం జరుగుతోందని, ఆయన రాజకీయ ప్రస్థానానికి దెబ్బ తగలవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ శిబిరంలో చురుగ్గా వ్వవ‌హ‌రిస్తున్న‌ జీవీఎల్‌ నరసింహారావును మోడీ-అమిత్‌షా ప్రోత్సహిస్తుండ‌టంతో రాంమాధవ్‌కు దూకుడుకు క‌ళ్లెం వేసిన‌ట్లుగా భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: