తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు జ‌రుగుతున్నాయి. టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్ నిలుస్తోంద‌న్న ప్రచారం జోరుగా జ‌రుగుతుండ‌టంతో ఆ పార్టీ నేత‌ల్లో జోష్ పెరుగుతోంది. అందరూ స‌మ‌ష్టిగా పార్టీ విజ‌యానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. విభేదాలు ప‌క్క‌న‌పెట్టి పార్టీనే ఫ‌స్ట్ అంటూ చేయిచేయి క‌లిపి ముందుకెళుతున్న స‌మ‌యంలో.. ఆ పార్టీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీమంత్రి దానం నాగేంద‌ర్ రాజీనామాతో ఒక్క‌సారిగా కాంగ్రెస్‌లో అల‌జ‌డి మొద‌లైంది. కీల‌క‌మైన స‌మ‌యంలో ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. 

Image result for trs

గ‌తంలో ఒక‌సారి ఆయ‌న కారెక్కేస్తార‌ని భావించినా.. అప్పుడు డిమాండ్ల విష‌యంలో గులాబీ బాస్ ఒప్పుకోక‌పోవ‌డంతో అది స‌ఫ‌ల‌మ‌వ్వ‌లేదు. కానీ ఈసారి మాత్రం ఇద్ద‌రు టీఆర్ఎస్‌ మంత్రులు, ఒక యువ నాయ‌కుడి చొర‌వ‌తో కారెక్కేసేందుకు లైన్ క్లియ‌ర్ అయ్యింద‌ట‌. ఎన్నిక‌ల ఏడాదిలో కాంగ్రెస్‌కు ఊహించ‌ని ఎదురుదెబ్బ త‌గిలింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు నేత‌లంద‌రూ ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మాజీ అధ్య‌క్షుడు దానం నాగేంద‌ర్ ఎట్ట‌కేల‌కు గులాబీ గూటికి చేరేందుకు లైన్ క్లియ‌ర్ అయింద‌నే చ‌ర్చ హాట్‌టాపిక్‌గా మారింది. 


గ‌తంలో అంటే గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే ఆయ‌న టీఆర్ఎస్‌లో చేరాలి, పార్టీలో చేరేందుకు ముహూర్తం కుదుర్చుకొని చివరి సమయంలో విరమించుకున్న విషయం తెలిసిందే. ఇందుకు దానం భారీ కోరికలే కార‌ణ‌మ‌ట‌. తనకు కేబినెట్ ర్యాంక్ ఉన్న రాష్ట్ర‌స్థాయి కార్పొరేషన్ పదవి, తన అనుచరులకు 3 కార్పొరేషన్ పదవులు, 25 మంది కార్పొరేటర్లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లివ్వాల‌ని ఆయ‌న కండీష‌న్లు పెట్టార‌ట‌. దీంతో ఖంగుతిన్న టీఆర్ ఎస్ నేతలు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేద‌ట‌. వీట‌న్నింటికీ గులాబీ బాస్ ఒప్పుకోక‌పోవ‌డంతో ఆ నిర్ణ‌యం వెన‌క్కు తీసుకున్నార‌ట‌. 

Image result for trs

ఈ ఎపిసోడ్ అనంతరం కూడా దానం నాగేందర్ టీఆర్ ఎస్ లో చేరుతారంటూ ప్రచారం జరిగింది. కొద్దికాలం క్రితం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీతో పాటు మరో ఎమ్మెల్యే టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఇక తర్వాతి వంతు దానం నాగేందర్ దేనని అన్నారు. అవి కేవలం ఊహాగానాలేనని ఇందులో వాస్తవం లేదని దానం వాటిని ఎప్పటికప్పుడు కొట్టిపారేశారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీకి దానం రాజీనామా చేయ‌డం పార్టీ నేత‌ల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దానం రాజీనామా లేఖ పంపినట్లు సమాచారం. అతి త్వ‌ర‌లోనే ఆయ‌న టీఆర్ ఎస్ లో చేరనున్నారని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ నేప‌థ్యంలో దానం నాగేందర్ మీడియా ముందుకు  ఆదివారం రానున్నారు. 


మరోవైపు నగరానికి చెందిన ఓ మంత్రి, టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఓ యువనేత క‌ల‌సి మ‌రో కీల‌క మంత్రితో భేటీ అయ్యార‌ట‌. దానం నాగేందర్ టీఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసుకున్నారని సమాచారం. ఆ ఇద్దరు మంత్రులతో కలిసి జరిపిన చర్చలను గులాబీ దళపతి కేసీఆర్ దృష్టికి చేరవేయగా ఆయన కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. మ‌రికొద్ది గంట‌ల్లోనే ఈ విషయంపై స్పష్టత వస్తుందని సమాచారం. అయితే దానం త్వరలో టీఆర్ ఎస్ లో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ నాయకులు దానం ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే దానం అందుబాటులో లేకపోవడంతో ఫోన్లో మాట్లాడినట్లు కాంగ్రెస్ నాయ‌కులు చెబుతున్నారు. సాయంత్రం ఉత్తమ్ ను దానం నాగేందర్ కలవ బోతున్నారని స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: