తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అదిరిపోయేలా ఏపీ సీఎం చంద్ర‌బాబు చ‌క్రం తిప్పుతున్నారా?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు తిరుగులేద‌ని భావిస్తున్న కేసీఆర్‌కు గ‌ద్దె దిగిపోయే స‌మ‌యం వ‌చ్చేసిందా?  దీనికి చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారా? వ‌్యూహాత్మ‌క రాజ‌కీయాల‌కు తెర‌దీశారా? అంటే.. తాజా ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. వాస్త‌వానికి తెలంగాణ‌లో టీడీపీకి పెద్ద‌గా బ‌లం లేదు. ఉన్న నాయ‌కులు కూడా ప‌క్క చూపులు చూస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అదికారంలోకి రావాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. 

Image result for trs

ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న అందివ‌చ్చిన పార్టీలతో చేతులు క‌లిపేందుకురెడీ అయ్యారు. బ‌ల‌మైన కూట‌మిగా ఏర్ప‌డి.. అధికార పార్టీని గ‌ద్దె దింపాల‌ని యోచిస్తున్న‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం అధికార పార్టీ టీఆర్ ఎస్ కాకుండా టీడీపీ, సీపీఐ,  తెలంగాణ జనసమితి(టీజేఎస్‌) పార్టీలు ఉన్నాయి. వీటితో పాటు బ‌ల‌మైన కాంగ్రెస్ కూడా టీఆర్ ఎస్‌ను ఓడించేందుకు ప‌క్కా వ్యూహంతో ముందుకుసాగుతున్నాయి.ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్న తెలంగాణ ఇంటి పార్టీ(టీఈపీ)ని కూటమిలో కలుపుకుని కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు. 


గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేయగా సీపీఐతో కలిసి కాంగ్రెస్‌ పోటీ చేసింది. టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేశాయి. సీపీఎం అటు వైసీపీతోను, ఇటు టీఆర్‌ఎస్‌తోనూ స్థానిక పరిస్థితుల్ని బట్టి పొత్తులు పెట్టుకుంది. ప్రస్తుతం టీడీపీ, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలూ విడివిడిగా పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అధికార పార్టీకే లాభం కలిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాల కూటమిని ఏర్పాటు చేసి అధికార టీఆర్ ఎస్‌కు గట్టి పోటీని ఇవ్వాలని చంద్ర‌బాబు యోచిస్తున్నారు. 


టీడీపీని అధికార టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేసుకోవడం, ఆ పార్టీ శాసనసభా పక్షాన్నే విలీనం చేసుకోవడంతో తెలంగాణ టీడీపీ నేతలు కాంగ్రెస్‌తో జట్టు కట్టేందుకే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కూటమిలో టీడీపీ కలిసి వస్తే గత ఎన్నికల్లో ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చిన గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ సుముఖంగా ఉంది. టీజేఎస్‌ కూడా కూటమిలో కలిసి వస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.  మొత్తంగా ఈ ప‌రిణామం అంతా చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే సాగుతోంద‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. టీఆర్ ఎస్‌కు ఓట‌మి ఖాయ‌మ‌నే అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: