ఎంవీ మైసూరా రెడ్డి.. రాజ‌కీయ దిగ్గజం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌(ఇప్పుడుకాదు). ముఖ్యంగా దివంగ‌త వైఎస్‌తో ఢీ అంటే ఢీ అన్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. వైఎస్‌కు వ్య‌తిరేకంగా పంటికింద రాయిగా కూడా మారారు. క‌డ‌ప జిల్లాకు చెందిన ఎంవీ.. కమలాపురం నియోజకవర్గంలో చ‌క్రం తిప్పారు. 1985-89-99లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన ఎంవీ మైసూరారెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. 2008లో టీడీపీలో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉంటున్నారు. అయితే, కొన్నాళ్లు... వైఎస్ త‌న‌యుడు స్థాపించిన వైసీపీలోకి కూడా వెళ్లారు. అయితే, అక్క‌డ పొస‌గ‌క‌పోవ‌డంతో మైసూరా.. అనూహ్యంగా జ‌గ‌న్‌కు షాకిచ్చి.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం ఖాళీగానే ఉన్నారు. 


అయితే, వ‌చ్చే ఏడాది లేదా అంత‌క‌న్నాముందుగానే జ‌రుగుతాయ‌ని భావిస్తున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌న స‌త్తా చాటాల‌ని మైసూరా భావిస్తున్నారు. అయితే, అది ఎలా అనేదే ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. కానీ, వాస్త‌వ ప‌రిస్థితిని చూస్తే.. కాంగ్రెస్‌, టీడీపీల్లో నాడు కీలకంగా వ్యవహరించిన వారికి మరోసారి టిక్కెట్‌ రావడం గగనంగా మారింది. వారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లినా ఆదరణ కనిపించడం లేదనే వ్యాఖ్య‌లు సైతం వినిపిస్తున్నాయి. కారణాలు ఏమైనా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు మాజీ అయిన తరువాత ప్రజలకు దూరమై పార్టీ సిద్ధ్దాంతాలతో నడవలేక ఇక మాజీలుగానే సరిపెట్టుకుం టున్నారు. 

త్వరలో రానున్న ఎన్నికల్లో కొందరు మాజీలు ఈ సారైనా తమకు టిక్కెట్‌ దక్కుతుందన్న ఆశతో ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు మైసూరా రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయ వ్యూహాల‌కు దిట్ట‌. అయితే, ఆయ‌న ముక్కు సూటి వ్య‌వ‌హార‌మే ఆయ‌నను పార్టీల్లో ఒంట‌రిని చేసింది. దీంతో ఆయ‌న ఏ పార్టీలోనూ ఇమ‌డ‌లేక పోయారు. మ‌రో ప‌ది మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు ఏం చేయాల‌నే దానిపై మైసూరా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. నేరుగా ఏదైనా పార్టీలో చేరి టికెట్ ద‌క్కించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డ‌మా?  లేక తెర‌వెనుక ఉండి ఎన్నిక‌ల వ్యూహాన్ని ముందుకు న‌డిపించ‌డ‌మా? అన్న‌ది ఆయ‌న చేస్తున్న ప్ర‌ధాన ఆలోచ‌న‌. 


నేరుగా ఎన్నిక‌ల్లోకి వెళ్లాలంటే.. ప్ర‌ధానంగా డ‌బ్బు చాలా అవ‌స‌రం. ఇప్ప‌టిక‌ప్పుడు ఉన్న ప‌రిస్థితిలో మైసూరా రెడ్డి డ‌బ్బుకు ఇబ్బంది ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లో పోటీ క‌న్నా.. తెర‌వెనుక ఉండి ఈ ఎన్నిక‌ల్లో కీల‌క రోల్ పోషించి.. త‌ద్వారా నామినేటెడ్ ప‌ద‌వులు పొంద‌డం బెట‌ర‌ని అంటున్నారు ఆయ‌న అనుచ‌రులు. ఇక‌, పార్టీల విష‌యంలోనూ మైసూరా ఎటూ తేల్చుకోలేద‌ని తెలుస్తున్నా.. ఆయ‌న ఎక్కువ శాతం.. టీడీపీవైపే మొగ్గు చూపిస్తార‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: