క‌ర్నూలు జిల్లా ఎంపీ బుట్టా రేణుక తాజాగా చిక్కుల్లో ప‌డింది. ఆమెకు తాజాగా ప్రారంభ‌మైన పార్ల‌మెంటు స‌మావేశాలు తీవ్ర ఇబ్బందిని సృష్టించ‌నున్నాయి. 2014లో వైసీపీ త‌ర‌ఫున క‌ర్నూలు ఎంపీగా గెలుపొందిన ఆమె దాదాపు మూడున్న రేళ్లు వైసీపీలోనే ఉన్నారు. ఫ్యామిలీ ప‌రంగా చూస్తే.. ఆమె భ‌ర్త నీల‌కంఠం.. టీడీపీలో కీల‌క నేత‌. అయిన‌ప్ప‌టికీ ఆమె 2014లో వైసీపీ త‌ర‌ఫునే పోటీ చేశారు. త‌ర్వాత కూడా టీడీపీ నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చినా ఆమె మౌనంగా ఉన్నారు. కానీ, అనూహ్యంగా 2017 మ‌ధ్య‌లో ఆమె టీడీపీలోకి జంప్ చేశారు. కానీ, కండువా క‌ప్పుకోలేదు. టీడీపీ స‌భ్య‌త్వ‌మూ తీసుకోలేదు. అయితే, జ‌గ‌న్ పంచ‌న మాత్రం లేదు. చంద్ర‌బాబు కు జైకొడుతున్నారు. బాబు చేప‌డుతున్న ప్ర‌తి కార్య‌క్ర‌మంలోనూ ఇటీవ‌ల ఆమె ద‌ర్శ‌న మిస్తున్నారు. 


అయితే, పార్ల‌మెంటు నియ‌మ‌నిబంధ‌నల మేర‌కు ఆమెపై ఫిరాయింపు చ‌ట్టం ప్ర‌యోగించే సూచ‌న‌లు తాజాగా క‌నిపిస్తు న్నాయ‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. ప్ర‌స్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశా లు ప్రారంభమయ్యాయి. అయితే, దీనికి ముందు అఖిలపక్ష సమావేశానికి వైసీపీ తరఫున హాజరు కావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి బుట్టా రేణుక‌కు లేఖ వెళ్లింది. నిజానికి పార్టీపక్ష నేత, ఉపనేతలకు మాత్రమే ఆహ్వానం పంపిస్తారు. కానీ లోక్‌సభలో వైసీపీ పక్షనేతగా ఉన్న వైసీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఉపనేత వైవీ సుబ్బారెడ్డి తమ పదవుల కు రాజీనామా చేయడంతో ప్రోటోకాల్‌ ప్రకారం ఆ తర్వాత స్థానంలో ఉండే విప్‌ను ఆహ్వానించారు. 


బుట్టా రేణుక వైసీపీ నుంచి టీడీపీలో చేరినా రికార్డుల ప్రకారం ఇంకా వైసీపీ విప్‌గానే కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయించినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని వైసీపీ లోక్‌సభ కమిటీకి పిటిషన్‌ ఇచ్చినా.. విప్‌గా తొలగించాలని స్పీకర్‌కు లేఖ ఇవ్వకపోవడం గమనార్హం. దాంతో నిబంధనల ప్రకారం వైసీపీ తరఫున సమావేశానికి హాజరుకావాలని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ ఆమెకు లేఖ పంపించింది. అయితే, ఈ సమావేశానికి రాజ్యసభ పార్టీ పక్షనేతగా విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఆ సమయంలో అక్కడ ఓ కుర్చీ ముందు ‘బుట్టా రేణుక... వైసీపీ’ అని రాసి ఉన్న నేమ్‌ప్లేట్‌ను ఆయన గమనించి కంగుతిన్నారు.  


ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తాము స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌కు లేఖ‌లు స‌మ‌ర్పించామ‌ని చెబుతున్న విజ‌య‌సాయి రెడ్డి మ‌రోసారి ఈ విష‌యంపై మ‌హాజ‌న్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని తాజాగా నిర్ణ‌యించారు. దీంతో బుట్టాకు తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇదే జ‌రిగితే.. ఫిరాయింపు చ‌ట్టం ప్ర‌కారం దాదాపు ఆరేళ్ల‌పాటు బుట్టాపై వేటు ప‌డే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి దీని నుంచి ఆమె త‌ప్పుకొంటుందా?  లేక వేటు వేయించుకుంటుందా చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: