సాధార‌ణ ఎన్నిక‌లు దూసుకొస్తున్న త‌రుణంలో ఏపీలో వ‌ల‌స‌లు జోరందుకున్నాయి.. పార్టీలు బ‌ల‌మైన అభ్య‌ర్థుల కోసం వేటాడుతుంటే.. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం అనువైన పార్టీల ప‌లువురు నేత‌లు వెతుకుతున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు కీల‌క నేత‌లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారు. ప్ర‌ధానంగా ఉత్త‌రాంధ్ర‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్న త‌రుణంలో టీడీపీ కూడా గ‌ట్టిప‌ట్టుద‌ల‌తో ఉంది. ఈ క్ర‌మంలో వైసీసీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన ఇద్ద‌రు నేత‌ల‌ను పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రంటే.. ఒక‌రేమో కొణ‌తాల రామ‌కృష్ణ‌, మ‌రొక‌రు స‌బ్బం హ‌రి. వీరి చేరిక‌తో ఉత్త‌రాంధ్ర‌లో టీడీపీ మ‌రింత బ‌ల‌ప‌డుతుంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. 

Image result for sabbam hari

కొణ‌తాల రామ‌కృష్ణ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితులు. వైఎస్సార్ దుర్మ‌ర‌ణం త‌ర్వాత ఆయ‌న జ‌గ‌న్ వెంట న‌డిచారు. కానీ, ఆ త‌ర్వాత త‌న‌ను జ‌గ‌న్ చిన్న‌చూపు చూశారంటూ కొణ‌తాల పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి, ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌లపై ఒంట‌రిగానే పోరాడుతున్నారు. ప్ర‌స్తుతానికి  ఏ పార్టీలోనూ లేని ఆయ‌న‌ నిజానికి.. ఎప్ప‌టి నుంచో టీడీపీలో చేరాల‌ని అనుకుంటున్నార‌ట‌. అయితే, అనూహ్యంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర‌నే టార్గెట్ చేయ‌డం.. అక్క‌డే ఎక్కువ‌గా ప‌ర్య‌టించ‌డం.. త‌న సొంత సామాజిక‌వ‌ర్గం అండ‌తో ముందుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. ఇలా చ‌క‌చ‌కా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కొణ‌తాల‌ను పార్టీలోకి తీసుకోవ‌డ‌మే మంచిద‌ని చంద్ర‌బాబు భావించిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న చేరిక‌కు బాబుగారు ఓకే చెప్పేసిన‌ట్లు స‌మాచారం. 

Image result for konathala ramakrishna

ఇక స‌బ్బం హ‌రి కూడా రాష్ట్ర విభ‌జ‌న‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీపై పోరాడారు. ఆయ‌న కూడా వైసీపీలో ఇమ‌డ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితే.. రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంద‌ని మ‌ద్ద‌తు ఇచ్చారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వ‌ల్లే గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ గౌర‌వ అధ్యక్షురాలు విజ‌య‌మ్మ ఓడిపోయార‌నే టాక్ అప్ప‌ట్లో బ‌లంగా వినిపించింది.

ప్ర‌స్తుతం సైలెంట్‌గా ఉంటున్న స‌బ్బం హ‌రి.. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లు స‌మాచారం. విశాఖ‌లో భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి, సీఎం చంద్ర‌బాబు స‌మ‌క్షంలో పార్టీ కండువాలు క‌ప్పుకునేందుకు వారిద్ద‌రూ ఉవ్విశ్లూరుతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా... ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఇద్ద‌రు కీల‌క నేత‌లు టీడీపీలోకి రావ‌డంతో ఉత్త‌రాంధ్ర‌లో పార్టీకి క‌లిసివ‌స్తుంద‌ని అంటున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: