జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. రాజ‌కీయాల్లో కొత్త పంథాకు తెర‌దీసిన‌ట్టు తెలుస్తోంది. రాజ‌కీయాల్లో ఎక్కువ శాతం సీట్ల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయించ‌డం ద్వారా రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టించాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి పోరాట యాత్ర‌కు  శ్రీకారం చుట్టిన పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఎన్నిక లు సమీపిస్తున్నందున ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలం పెంచుకునే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తోంది. గ్రామ స్థాయి నుంచి నాయకులను తయారు చేసి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే దిశలో బూత్‌ కమిటీల నియామ కానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తద్వారా ప్రధాన పార్టీలకు ధీటుగా పుంజుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. 
 Image result for pawan kalyan
ఇప్పటివరకు జిల్లాలో జనసేనకు నాయకులను నియమించని ఆయన నాయకుల నియామకంపై దృష్టి సారించారు. అందులో భాగంగా తొలి సారి జిల్లాకు రాజకీయ వ్యవహారాల సమన్వయకర్తలుగా ముగ్గురిని నియమించారు. వీరిలో ఇద్దరు మహిళలే కావడం విశేషం. అయితే జిల్లా జనాభాలో పురుషుల కంటే మహిళా జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనసేనలో మహిళా నాయకత్వానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలని పవన్‌ నిర్ణయించిన‌ట్టు స‌మాచారం.  అందులో భాగంగానే తొలి నియామకంలో మహిళలకు పెద్దపీట వేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. 


కొత్తగా నియమితులైన రాజకీయ వ్యవహారాల సమన్వయ కర్తల్లో శ్రీకాకుళం నుంచి బీఎస్‌ ప్రభు, పాల కొండ నుంచి పి.యశస్విని, పలాస నుంచి సుజాత పండా ఉన్నారు. పాలకొండకు చెందిన వీరఘట్టం మండల మాజీ ఎంపీపీ కుమార్తె పాలవలస యశస్విని ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నారు. తనకు జిల్లాలో జనసేన బాధ్యతలు అప్పగిస్తే సమర్థంగా పనిచేస్తానని పవన్‌కు వివరించడంతో ఆమెను పాలకొండ డివిజన్‌లో నియమించారు. పలాసలో సుజాత పండా (ఒడి షాకు చెందిన వారు) టెక్కలి డివిజన్‌ పరిధిలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. 


వీరంతా ఇకపై జిల్లాలో పది నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మండల, నియోజక వర్గ స్థాయిల్లో కొత్త నేతలను గుర్తించే దిశలో చర్యలు తీసుకుంటారు. పనితీరు ఆధారంగా పదవులు కట్టబెట్టడం జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటి కావడంతో ఈ విధానం అందరికీ వర్తిస్తుందని నేతలు వివరించారు. ఇక‌, మ‌హిళ‌ల‌కు పెద్ద పీట వేయ‌డం ద్వారా రాష్ట్రంలోని మిగిలిన పార్టీల‌ను ఇరుకున పెట్టే చాన్స్ ఉంటుంద‌ని, దీనివ‌ల్ల జ‌న‌సేన‌కు ల‌బ్ది చేకూరుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: