గద్వాల సంస్థానంరెండు నదుల సంగమ స్థలానికి పశ్చిమాన గల సారవంతమైన నేల అది. పచ్చని పంటలు పండాల్సిన ఆ నేలపై కొన్ని శతాబ్దాల పాటు నెత్తురు పారింది. విజయనగర చక్రవర్తులకు, బహమనీ సుల్తానులకు మధ్య వైరానికి కారణమైన భూమి దోబ్ గద్వాల సంస్థానంలోనే ఉండేది. గద్వాల సంస్థానానిది అంతటి చరిత్ర మరి. గద్వాల సంస్థానం తుంగభద్ర, కృష్ణా నదుల మధ్య గల నడిగడ్డ ప్రాంతంలో దాదాపు 864 చ.కి.మీ.ల మేర విసర్తించి ఉండేది. దీనికే కేశవనగరం అనే పర్యాయ నామం కూడా ఉంది. ఈ సంస్థానం 214 గ్రామాలు, లక్షకుపైగా జనాభాను కలిగి ఉండేది. గద్వాల సంస్థానాధీశులు పాకనాటి రెడ్ల వంశానికి చెందినవారు. వీరిది మిడిమిళ్ల గోత్రం. వీరి ఇంటి పేరు ముష్టిపల్లి వారు. కాకతీయుల కాలంలో ముష్టిపల్లి వారు నడిగడ్డ ప్రాంతంలోని కొన్ని సీమలపై నాడగౌడ అధికారం కలిగి ఉండేవారు. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కొంతకాలం విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్నారు.


ఆ సామ్రాజ్య పతనంతో సార్వభౌమాధికారం చేతులు మారింది. దీంతో గద్వాల వారు బీజాపూర్ సుల్తానుల ఆధీనంలోకి వెళ్లారు. వారి నుంచి నాడగౌడు, సర్ నాడగౌడు అధికారం పొంది పాలన సాగించారు. మూలపురుషుడు పెద్దనకాణాదం పెద్దన సోమయాజి రాసిన ప్రబంధం ముకుంద విలాసము ద్వారా గద్వాల సంస్థానాధీశుల మూలపురుషుడు పెద్దన అని తెలుస్తున్నది. ఈయనకే పెద్దన నృపుడు, పెద్దభూవిభుడు, పెద్ద భూపాలుడు, పెద్దారెడ్డి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇతని భార్య పూడూరి నాడగౌడు వీరారెడ్డి కుమార్తె బక్కమాంబిక.


పెద్దన ఇల్లరికపు అల్లుడిగా పూడూరి నాడగౌడు అధికారం చేపట్టాడు. బక్కమాంబిక, పెద్దనల కుమారుడు ప్రసిద్ధుడయిన పెద సోమభూపాలుడు. ఈయన గొప్పతనం, శౌర్యపరాక్రమాలు ప్రామాణిక సాహిత్యం ద్వారానే కాకుండా, జానపద సాహిత్యం ద్వారా కూడా తెలుస్తున్నాయి. జానపద గాథల్లో ఈయనను శోభనాద్రి, సోమనాద్రిగా కీర్తించారు. ఇతనికే నల్ల సోమనాద్రి, నల సోమభూపాలుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. గద్వాల దుర్గాన్ని క్రీ.శ. 1663 -1713 మధ్య కాలంలో నిర్మించింది ఈయనే. గద్వాల కోట మహబూబ్‌నగర్ జిల్లాలోని కోటలన్నింటిలోకెల్లా ప్రసిద్ధి చెందింది. ఇదిప్పుడు జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణం నడి బొడ్డున చెక్కు చెదరకుండా ఉంది.


గద్దపల్లె అనే గ్రామం వద్ద నిర్మించిన దుర్గం చుట్టూ ఏర్పడిన పట్టణం కాబట్టి, దానికి గద్వాల అనే పేరు వచ్చినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు. ఇంకొందరేమో, ఈ సంస్థానం పూర్వీకులు యుద్ధాల్లో ఆయుధాలుగా గదను, వాలమును ప్రయోగించేవారు, అందుకే ఈ ప్రాంతానికి గదవాల (గద+వాల=గద్వాల) అనే పేరొచ్చిందని చెబుతుంటారు. వీరాధివీరుడు సోమనాద్రిసోమనాద్రి అనే పెద సోమభూపాలుడు గద్వాల సంస్థానానికి ఘనకీర్తిని తెచ్చిపెట్టాడు. గద్వాల కోట నిర్మాణంలో ఉప్పేరు, కర్నూలు, రాయచూరు నవాబుల నుంచి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు. వీటి గురించి స్థానికులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు.


ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిపై విజయం సాధించి సోమనాద్రి కోట నిర్మాణం పూర్తి చేశాడు. అటు తర్వాత పూడూరి నుంచి రాజధానిని గద్వాలకు మార్చి పాలన సాగించాడు. ఇదే కోటలో చెన్న కేశవస్వామి దేవాలయాన్ని సోమనాద్రియే అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం ఇప్పటికీ చూపరులను ఆకట్టుకుంటాయి. పూడూరి నుండి కేశవస్వామిని తెచ్చి సోమనాద్రి ఇక్కడ ప్రతిష్టించాడు. ఈ స్వామియే అటు తర్వాత గద్వాల సంస్థానాధీశుల కులదైవమయ్యాడు. ఈ స్వామి పేరు మీదనే గద్వాల కేశవనగరంగా కూడా పేరొందింది. సోమనాద్రి సర్వతోముఖ ప్రజ్ఞ కలిగిన పాలకుడు.


బీజాపూరు సుల్తానులను జయించడంలో సోమనాద్రి మొఘల్ బాద్‌షా ఔరంగజేబుకు సహకరించాడట. ఇతని ధైర్యసాహసాలకు, శౌర్యపరాక్రమాలకు మెచ్చిన ఔరంగజేబు క్రీ.శ.1704లో రాజా బిరుదునే కాక, గద్వాల ప్రాంతంపై ఆధిపత్యపు సన్నదును కూడా ఇచ్చి సత్కరించాడు. నిడ్జూర్ యుద్ధంఢిల్లీ పీఠంపై బహదూర్ షా బలహీన పాలన సాగుతున్న కాలంలో దక్షిణ సుబేదార్ నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అయితే, హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రి మాత్రం బహదూర్ షాకు అనుయాయిగానే పాలన కొనసాగించాడు.


ఇది సహించని నిజాం తన సేనాని అయిన దిలీప్ భానుడిని ఉసిగొల్పి గద్వాల సంస్థానంపై దండయాత్రకు పంపించాడు. దిలీప్ భానుడి సేన, సోమనాద్రి సేనలు కర్నూలు సమీపంలో నిడ్జూర్ దగ్గర భీకరంగా తలపడ్డాయి. చివరికి ఈ యుద్ధంలో సోమనాద్రి వీరమరణం చెందాడు.  Chennakeshava రాణుల పాలనపెద సోమభూపాలునికి అమ్మకాంబ, లింగాంబ, రామాంబ అని ముగ్గురు భార్యలు. లింగాంబ, పెద సోమభూపాలునికి తిరుమలరాయలు, రామరాయలు అని ఇద్దరు పుత్రులు. అమ్మకాంబకు సంతానం లేకపోవడం వల్ల పెద సోమభూపాలుని తర్వాత తిరుమలరాయలు కొంతకాలం పాలన సాగించాడు. ఇతని పరిపాలన సంతృప్తికరంగా లేకపోవడం వల్ల సోమభూపాలుని పట్టపురాణి అమ్మకాంబ (అమ్మక్కమ్మ), ఇంకొంత కాలం లింగాంబ (లింగమ్మ) సంస్థాన పాలనా బాధ్యతలు చేపట్టారు.


వీరి తర్వాత తిరుమలరాయల తమ్ముడు రామరాయలు (క్రీ.శ. 1724-1762) పాలించాడు. రామరాయలుకు సంతానం కలుగలేదు. దీంతో అన్న తిరుమలరాయల కొడుకు చినసోమభూపాలుడిని దత్తత తీసుకున్నాడు. రామరాయలు తర్వాత ఈయనే క్రీ.శ. 1762 నుంచి 1793 వరకు సంస్థానాన్ని పాలించాడు. ఈయన భార్య రామాంబ. కొడుకు శ్రీరామరాయలు. ఇతడు తండ్రి తర్వాత క్రీ.శ. 1793లో సంస్థాన పాలన బాధ్యతలను స్వీకరించాడు. అటు తర్వాత వీరి కోవలో రాజా రామభూపాల రావు ప్రసిద్ధి. ఈయన క్రీ.శ. 1844 1902 వరకు పాలన సాగించాడు. 1902లో రాజా రామభూపాల రావు మరణించాడు. అప్పటికి ఆయన వెంకట్రామిరెడ్డిని దత్తపుత్రునిగా స్వీకరించి సీతారామ భూపాల్ అని నామకరణం చేశాడు. రామభూపాల రావు మరణించే నాటికి ఈయన పిన్న వయస్కుడు.

Chennakeshava

దీంతో సంస్థానం పదేండ్ల పాటు కోర్ట్ ఆఫ్ వార్డ్స్ పాలనలోకి వెళ్లింది. మేజర్ అయిన తర్వాత రాజా సీతారామ భూపాల్ బల్వంత్ బహద్దూర్ క్రీ.శ. 1912లో పాలనాధికారం చేపట్టాడు. నిజాం ఈయనకు మహారాజా అనే బిరుదును ప్రధానం చేశాడు. పన్నెండేండ్ల పాటు పాలించిన ఈయన క్రీ.శ. 1924లో అకాల మరణం చెందడంతో సంస్థానం చిక్కుల్లో పడింది. అయినా మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ చాకచక్యంగా వ్యవహరించి సంస్థానానికి పూర్వ వైభవం తీసుకొచ్చింది. మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మమహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ రాజా సీతారామ భూపాల్ బల్వంత్ బహద్దూర్ భార్య. భర్త మరణానంతరం మహారాణి పాలనా బాధ్యతలు చేపట్టి క్రీ.శ. 1949 వరకు పాలించారు.


ఈమే ఈ సంస్థానపు చివరి పాలకురాలు. ఈమె పెద్ద కుమార్తె రాణీ సత్యవరలక్ష్మీ దేవి. ఈవిడ దోమకొండ ప్రభువు సోమేశ్వరరావును పెండ్లాడింది. రాణి ఆదిలక్ష్మీదేవమ్మకు మగ సంతానం లేకపోవడంతో తన మనుమడు సత్యవరలక్ష్మీ దేవి కొడుకైన రాజా కృష్ణరామభూపాల్‌ను దత్తత తీసుకుంది. ఈయనకు గద్వాల కోట బాధ్యతల్ని అప్పగించి అతడి పేరుతో ఆదిలక్ష్మీదేవమ్మ సంస్థాన బాధ్మతల్ని కొనసాగించింది. మహారాణీ ఆదిలక్ష్మీదేవమ్మ నిజాం నవాబును ఎదురించిన ధీరవనిత. గద్వాల సంస్థానాన్ని స్వతంత్ర సంస్థానంగా ప్రకటించి పాలించిన ధీశాలి.

Gadwal_Fort

సీతారామభూపాలునికి మగ సంతానం లేకపోవడంతో నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ తమ రాజ్యంలో సంస్థానాన్ని కలుపుకొన్నాడు. దీంతో రాణి న్యాయ పోరాటం చేసి సంస్థానాన్ని తిరిగి చేజిక్కించుకున్నది. 1948లో సంసాన్థాలు, జాగీర్దారుల పాలన రద్దు కావడంతో రాణి సంస్థానపు ఆస్తులను, చారిత్రక కోటను ప్రభుత్వ పరం చేసింది. ఈమె పేరు మీదుగా గద్వాల కోటలో మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ (మాల్డ్) ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇది పాలమూరులో ఏర్పాటైన మొదటి డిగ్రీ కళాశాల.


మహారాణి ఆగస్టు 18, 1953న మరణించారు. మహారాణి వారసులు ఇప్పుడు హైదరాబాద్‌లో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. వచ్చేవారం : అమరచింత సంస్థానంGadwal_Fort శత్రు దుర్భేద్యమైన గద్వాల కోట గోడలపై సంస్థాన పురాతన చరిత్ర ఇప్పటికీ ప్రతిబింబిస్తుంటుంది. గోడలను మట్టితో కట్టినా పునాది మాత్రం పెద్ద రాళ్లతో పొందికగా ఉంటుంది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఈ కోట ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. 16 బురుజులతో వృత్తాకారంలో నిర్మించిన ఈ కోట గోడ సుమారు 20 అడుగుల మందంతో ఉంటుంది. కోట చుట్టూ సుమారు 30 అడుగుల లోతైన కందకాన్ని రాతి గోడలతో నిర్మించారు. మట్టితో నిర్మించిన ఇంతటి పెద్ద కోట, మహా కందకం దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదని చరిత్రకారులు చెబుతుంటారు. కోటలోపల రాజసౌధం, సోమనాద్రి వారసుల విగ్రహాలు, పెద్ద బావి, దశమికట్ట, అశ్వశాల ఇతర కట్టడాలు సంస్థానాధీశుల చరిత్రను ఇప్పటికీ తెలియజేస్తున్నాయి. ఇటీవలే గట్టు ఎత్తిపోతల పథకానికి గద్వాల సంస్థానాధీశుల్లో వీరాధివీరుడైన సోమనాద్రి పేరు పెట్టిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: