అన్నేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.. ఆయ‌న అభిమానులేమో త‌మ్ముడి పార్టీ జ‌న‌సేన‌లో చేరారు.. అంతేగాకుండా.. ప్రస్తుతం వివిధ పార్టీల్లో ఉన్న నాటి ప్ర‌జారాజ్యం తుక్కంతా.. జ‌న‌సేన‌లో క‌లుస్తోంది.. ఎన్నిక‌ల నాటికి ఇది మ‌రింత‌గా వ‌చ్చి చేరే అవ‌కాశం ఉంది. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిరు అభిమానుల‌తో స‌మావేశం నిర్వ‌హించి పార్టీలోకి ఆహ్వానించారు. తాను కొత్త‌ద‌నం కోరుకుంటున్నాన‌ని చెబుతున్న ప‌వ‌న్ నాటి తుక్కునంతా తెచ్చుకుని ప‌క్క‌నేసుకుంటున్నారు. నిజానికి ఇది విచిత్రంగానే క‌నిపిస్తోంది. ఎన్నిక‌లు త‌రుముకొస్తున్నా..ప‌వ‌న్ ప్లాన్ ఏమిటో ఆయ‌న సైనికుల‌తోపాటు ప్ర‌జ‌ల‌కూ అర్థం కావ‌డం లేదు. ఇటీవ‌ల ఆయ‌న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో ప‌ర్య‌టించిన త‌ర్వాత నాటి ప్ర‌జారాజ్యం నాయ‌కులు జ‌న‌సేన‌లో క‌లిసేందుకు ముందుకు వ‌స్తున్నారు. 


వాస్త‌వానికి.. జ‌న‌సేన‌లో ప‌వ‌న్‌, చిరు అభిమానులు త‌ప్ప ఇత‌రులెవ‌రూ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల ప‌వ‌న్‌ భీమ‌వ‌రం వచ్చి వెళ్లిన త‌ర్వాత కొంత మేర‌కు చేరిక‌లు ఎక్కువ అయితే,  ఆ చేరేవారంతా మ‌రెవ‌రో కాదు.. నాడు చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలో కొన‌సాగి.. చిరు పుట్టి ముంచ‌డంతో దిక్కు తెలియ‌ని, దారితోచ‌ని స్థితిలో ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిన వారే కావ‌డం గ‌మ‌నార్హం. అంటే ప్ర‌స్తుతం జ‌న‌సేన‌లోకి వ‌చ్చేది అప్ప‌టి ప్ర‌జారాజ్యం నాయ‌కులేన‌న్న‌మాట‌. నరసాపురం, ఏలూరు త‌దిత‌ర ప్రాంతాల్లో జన సేనకు జైకోట్టే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది. మండలంలోని సీతారాంపురానికి చెందిన కలవకొలను తులసి ప్రజారాజ్యం పార్టీలో జిల్లా కన్వీనర్‌గా కూడా కొనసాగారు. ప్రస్తుతం ఈయనే జనసేనలో జిల్లా బాధ్యతలను మోస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 Image result for pawan kalyan

ఏపీలోని అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మైలా వీర్రాజు ప్రజారాజ్యం పార్టీలో కృష్ణా జిల్లా పెడన నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం ఈయ‌న‌ కూడా జనసేనలో చేరి నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. వీరితోపాటు నాడు ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేసిన వేగేశ‌న క‌న‌క‌రాజు సూరి ఇప్పుడు జ‌న‌సేన‌లో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక కృష్ణా జిల్లాలోనూ, గుంటూరు జిల్లాలోనే ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. గుంటూరులో ప్ర‌జారాజ్యంలో కీల‌కంగా ఉన్న తోట చంద్ర‌శేఖ‌ర్ ఇప్ప‌టికే జ‌న‌సేన‌లో కీల‌క ప‌ద‌విలో ఉన్నారు. 


గుంటూరు వెస్ట్ సీటు నుంచి ప్ర‌జారాజ్యం త‌ర‌పున అసెంబ్లీకి పోటీ చేసిన తుల‌సి ఫ్యామిలీ కూడా ఇప్పుడు జ‌న‌సేన‌లో ఇక్క‌డ కీల‌కంగా ఉంటోంది. అయితే, గత ఎన్నికల్లో పవన్‌ టీడీపీకి మద్దతు తెలపడంతో వీరు కూడా ఆ ఎన్నికల ప్రచారాల్లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు వీరంతా పవన్ చెంత‌ చేరారు. విష‌యం ఏమిటంటే.. గతంలో వీరు కూడా ప్రజారాజ్యం పార్టీలో ప‌ని చేసిన వారే. ఇలా ప్ర‌త్య‌క్షంగా కొంద‌రు.. ప‌రోక్షంగా మ‌రికొంద‌రు జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుగా ఉండ‌డంతో ఆయా పార్టీ వ‌ర్గాల్లో కొంత గంద‌ర‌గోళ‌ప‌రిస్థితి నెల‌కొంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: