ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీల‌కు మేలు చేస్తుంది అంటారు. ఈ నేప‌థ్యంలోనే దేశంలో ప్ర‌తి పార్టీ కూడా వ‌ర్గాలు పెట్టుకోవ‌ద్దు.. గ్రూపు రాజ‌కీయాలు చేయొద్దు.. క‌లిసి మెలిసి పార్టీల‌ను న‌డిపించండి.. గెలిపించండి.. అని ప్ర‌క‌టిస్తుంటాయి కూడా! గ‌తంలో జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో ఈ వ‌ర్గ పోరు ఎక్కువ‌గా ఉండేది. అధిష్టానాన్ని మెప్పించ‌డం కోసం నాయ‌కులు.,. ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు పాల్ప‌డేవారు. గ్రూపులు క‌ట్టేవారు. ఇక‌, ఈ ప‌రిస్థితి రానురాను ప్రాంతీయ పార్టీల‌కు కూడా పాకింది. ముఖ్యంగా ఏపీ అధికార పార్టీని బ‌జారున ప‌డేస్తోంది ఈ గ్రూపు రాజ‌కీయాలు.. వ‌ర్గ రాజ‌కీయాలే! 


పోనీ.. టీడీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లో ఈ వ‌ర్గ పోరు జ‌రిగినా వేరేగా ఉండేది. కానీ.టీడీపీకి  చాలా బ‌లం త‌క్కువ‌గా ఉన్న నెల్లూరులోనే వ‌ర్గ‌, గ్రూపు రాజ‌కీయాలు సాగుతుండ‌డంతో పార్టీ మ‌నుగ‌డ‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని సీనియ‌ర్లు అంటు న్నారు. మ‌రో ఆరేడు మాసాల్లోనే  ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఈ గ్రూపు, వ‌ర్గ రాజ‌కీయాల‌కు ఫుల్ స్టాప్ ప‌డాల‌ని కూడా వారు కోరుకుంటున్నారు. ఇక‌, తాజా విష‌యంలోకి వ‌స్తే.. నెల్లూరులో టీడీపీ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఆ పార్టీలోనే ఉంటున్న సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి, ప్ర‌స్తుతం పార్టీకి కీల‌కంగా మారిన ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. దీనికి కార‌ణాలు ఏమైనా.. ఈ ఇద్ద‌రు నాయ‌కులు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారే త‌ప్ప‌.. క‌ల‌సి క‌ట్టుగా మాత్రం ముందుకు సాగ‌డం లేదు. 

Image result for adala prabhakar reddy

ముఖ్యంగా ఆత్మకూరు నియోజ‌క‌వ‌ర్గంలో కన్నబాబు, ధనంజయరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మంత్రి సోమిరెడ్డికి సన్నిహితులుగా ముద్రపడ్డారు. అందువల్లే ఆదాల వీరి విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.  ఇటీవ‌ల నెల్లూరులో ఎన్టీఆర్‌ ఇళ్లకు లాటరీ కార్యక్రమం సందర్భంగా జరిగిన ఘటన ఆదాల.. సోమిరెడ్డిని టార్గెట్‌ చేసుకున్నారనే ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోంది. వాస్తవానికి ఈ లాటరీ కార్యక్రమం సోమిరెడ్డి నివాసం పరిసరాల్లో జరిగింది. రూరల్‌ నియోజకవర్గంలో సోమిరెడ్డికి బలమైన పట్టు ఉంది. పైగా జిల్లా మంత్రి. ఈ కోణాల్లో గమనిస్తే ఆయన్ను ఇళ్ల కేటాయింపు కార్యక్రమానికి ఆహ్వానించి ఉండాల్సింది. 


అయితే తను ఇన్‌చార్జిగా ఉన్న రూరల్‌ నియోజకవర్గంలో జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి సోమిరెడ్డిని ఆహ్వానించ డానికి వీలు లేదని ఆదాల అల్టిమేటం ఇచ్చారని, ఆ కారణంగానే సోమిరెడ్డిని ఆహ్వానించలేదని పార్టీ నాయకులు అంటున్నారు. అదే సమయంలో ఈ పరిణామాలు పార్టీకి నష్టం కలుగజేస్తాయనే ఆందోళన జిల్లా పార్టీ నాయకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఆదాల అంతరంగం ఏమిటో అర్థం కావడం లేదని, ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, కొంత మంది విషయంలో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారో అంతుచిక్కడం లేదని పార్టీ ముఖ్యులు తలలు పట్టుకొంటున్నారు. ఇక‌, సోమిరెడ్డి కూడా ఆదాలకు ఎక్క‌డిక‌క్క‌డ చెక్ పెడుతున్నారు. దీంతో నెల్లూరు టీడీపీలో పెద్ద ఎత్తున వీరిద్ద‌రి రాజ‌కీయాలే ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తున్నాయి. మ‌రి వీటిని చంద్ర‌బాబు ఎలా స‌రిదిద్దుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: