2014లో ఏర్పాటైన ఏపీ ప్ర‌భుత్వంలో ఇటీవ‌లి కాలం వ‌ర‌కు లేని చ‌ల‌నం ఇప్పుడు వ‌చ్చింది. వివిధ వ‌ర్గాల‌కు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టిన సీఎం చంద్ర‌బాబు.. మైనార్టీ శాఖ‌ను ఏర్పాటు చేయ‌డం కానీ, దానికి మంత్రిని నియ‌మించ‌డం కానీ చేయ‌లేదు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇది త‌న‌కు వ్య‌తిరేకంగా ప‌రిణ‌మించే చాన్స్ ఉంద‌ని ఆయ‌న గుర్తించారు. వ‌చ్చే ఎన్నిక‌లు త్రిముఖ పోటీలో సాగుతుండ‌డం, ప్ర‌తి సీటూ అత్యంత కీల‌కం కావ‌డం, ముఖ్య‌మైన ప్ర‌జాఆక‌ర్ష‌ణ గ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌లు రంగంలోకి దిగుతుండ‌డంతో ప్ర‌తి విష‌యాన్నీ చంద్ర‌బాబు బూత‌ద్దంలోనే చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మైనార్టీ శాఖ‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు.. మైనార్టీ మంత్రిని కూడా నియ‌మించాల‌ని నిర్ణ‌యించారు. 


ఈ నేప‌థ్యంలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు మూహూర్తం కూడా ఖ‌రారు చేశారు. ఈ నెల 28 త‌ర్వాత ఎప్పుడైనా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగే ఛాన్స్ ఉంద‌ని తాజాగా అందిన స‌మ‌చారం. ఇటీవల విజయవాడకు వచ్చిన తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలుసుకున్న సమయంలో ఈ విషయం చూచాయిగా చెప్పిన‌ట్టు తెలిసింది.  ఏపీ మంత్రి వర్గంలో మరో ఇద్దరిని తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇద్దరిలో ముఖ్యంగా మైనారిటీలకు స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచి నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన మైనారిటీల సమావేశంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. 


ఈ నెల 28న గుంటూరులో రాష్ట్ర వ్యాప్త మైనారిటీ సదస్సును ఏర్పాటు చేశారు. దీనిని నారా హ‌మారా- టీడీపీ హ‌మారా నినాదంతో నిర్వ‌హిస్తుండడం అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ సదస్సు సందర్భంగా సీఎం మైనారిటీని మంత్రివర్గంలోకి తీసుకునే విషయాన్ని ప్రకటించడంతోపాటు, ఏ రోజు మంత్రి వర్గ విస్తరణ చేపడతామనేది కూడా ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీకి చెందిన మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌ రాజీనామా చేయడంతో కేబినెట్‌లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. అందులో ఒక ఖాళీని ముస్లిం మైనారిటీ నేతతో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 


మ‌రో సీటును టీడీపీ నుంచి విజ‌యం సాధించిన ఏకైక గిరిజ‌న ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌కు కేటాయించే చాన్స్ ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్త‌న్నాయి. పోల‌వ‌రం నుంచి గెలిచిన ముడియం..ఇక్క‌డ పార్టీ ప్ర‌తిష్ట‌ను గ‌డిచిన ఆరేళ్ల‌లో(ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్స‌రాల ముందు నుంచి) భారీ ఎత్తున పెంచారు. కాంగ్రెస్‌కు, వైసీపికి సానుభూతి ప‌రులుగా ఉన్న గిరిజ‌నుల‌ను టీడీపీ వైపు మ‌ళ్లించేందుకు నిద్రాహారాలు మాని ఆయ‌న అహ‌ర‌హం శ్ర‌మించారు. ఫ‌లితంగా రాష్ట్రంలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క పోల‌వ‌రంలో త‌ప్ప మిగిలిన చోట్ల టీడీపీ ఓట‌మి పాలైంది. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు ముడియంకు స‌ముచిత స్థానం ఇస్తార‌ని అంటున్నారు. ఇదే జ‌రిగితే.. ఆయ‌న‌కు కూడా కేబినెట్‌లో బెర్త్ ద‌క్కే అవ‌కాశం కొట్టిపారేయ‌లేమ‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: