రాజ‌కీయాల్లో సెంటిమెంట్ల‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.నాయ‌కులు, పార్టీలు ఏవైనా స‌రే.. సెంటిమెంట్‌ను ఓట్లుగా మ‌లుచుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు అనేకం ఉంటాయి. స‌మ‌యానికి త‌గు మాట్లాడిన విధంగానే.. స‌మ‌యానికి ఏది అందివ‌స్తే.. దానినే త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే నాయ‌కులు గ‌తంలో కంటే ఇప్పుడు భారీ సంఖ్య‌లో పెరుగు తున్నారు.  విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్రం ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. దీంతో అన్ని రాజ‌కీయ పార్టీలూ.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసేందుకు రెడీ అయ్యాయి. 


ఈ క్ర‌మంలోనే అతి పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ తిరిగిన త‌న అస్థిత్వాన్ని నిలుపు కొనేందుకు నానా తంటాలు ప‌డుతోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో త‌న వ్యూహాత్మ‌క అడుగుల‌తో ముందుకు వెళ్లాల‌ని నిర్ణ యించుకుంది. పోయిన చోట వెతుక్కోవాల‌నే సామెత‌ను కాంగ్రెస్ నిజం చేయాల‌ని చూస్తోంది.  ఈనేప‌థ్యంలో విభ‌జ‌న కార‌ణంగా ఏపీ ప్ర‌జ‌లకు దూర‌మైన ఆ పార్టీ.. ఇప్పుడు అదే విభ‌జ‌న తాలూకు ఆగిపోయిన హామీల‌ను అమ‌లు చేయ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇది కొత్త విష‌యం కాదు! తాజాగా వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ సార‌ధి రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు.  


‘నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం స్పష్టమైన హామీ ఇచ్చింది. ఇదేమీ ఆంధ్రప్రదేశ్‌కు అయాచితంగా ఇచ్చే బహుమతి కాదు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు. పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి ఇచ్చిన హామీ. నేను దానిని తేలికగా తీసుకోను. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. నేను ప్రత్యేక హోదా ఇస్తానని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు హామీ ఇస్తున్నా’’ అన్నారు. అయితే, ఈ హామీని న‌మ్మేందుకు ఏపీ ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా అనేది ఇప్పుడు సెంటిమెంట్ అయిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఈ విష‌యానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. 


బ‌హుశ దీనిని గ‌మ‌నించే అధికార పార్టీ నేత చంద్ర‌బాబు, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కు విస్మ‌రించిన ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కాంగ్రెస్‌ను ఎలా న‌మ్మేది అని ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏక‌ప‌క్షంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే .. దీనిపై నిజంగానే కాంగ్రెస్ ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంది కానీ, అలాంటి ప‌రిస్థితి ఇప్పుడు కేంద్రంలో ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. సంకీర్ణ ప్ర‌భుత్వాల ఏర్పాటే ఆవ‌శ్య‌కంగా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో రాహుల్ చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల‌కు ప్రాధాన్యం లేకుండా పోతోంద‌ని అంటున్నారు ప్ర‌జ‌లు. సో.. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌క‌ట‌న‌పై సానుకూలత వ్య‌క్తం కావ‌డం లేదు! మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: