ప‌త్రికాధిప‌తి, రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్‌ జనసేనలోకి కాస్త ముందస్తుగానే చేరారు. 2014 ఎన్నికల ముందు టిక్కెట్టు ఆశించి టీడీపీలో చేరిన శశిధర్‌.. టికెట్‌ రాకపోవడంతో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లారు. అక్కడా నిరాశ ఎదురైంది. ఇక అక్క‌డ ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌యోజ‌నం లేద‌ని భావించి జనసేనలోకి ఫిరాయించారు. అయితే, ఇక్కడా తనయుడి రాజకీయ భవిష్యత్ గంద‌ర‌గోళంగానే ఉంద‌న్న అభిప్రాయం ముత్తా గోపాలకృష్ణలో క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గోపాలకృష్ణకు జనసేన పార్టీ సలహామండలి సభ్యుడిగా నియమితులయ్యారు. కానీ తనయుడి టిక్కెట్టుకు భరోసా మాత్రం ఇంకా దొరకలేదు. 


వాస్త‌వానికి పవన్‌కల్యాణ్‌ మాత్రం ఇప్పటివరకు ఎవరికీ టిక్కెట్టు హామీ ఇవ్వలేదు. కనీసం పరిశీలిద్దామన్న మాట కూడా అనలేదంటున్నారు. ఈ నేప‌థ్యంలో ముత్తా ఫ్యామిలీ ప‌రిస్థితి ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింది. ఇక‌, జ‌న‌సేన‌లో చేరిన‌ప్ప‌టి నుంచి ముత్తా వారి ప‌త్రిక‌లో అనూహ్య‌మైన మైలేజీ క‌నిపిస్తోంది. జ‌న‌సేన‌కు సంబంధించిన వివిధ క‌థ‌నాలను విస్తృత స్తాయిలో ఇస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పోస్ట్ మార్ట‌మ్ కూడా చేస్తున్నారు. ఎవ‌రెవ‌రు జ‌న‌సేన‌లోకి వ‌స్తున్నారు ? ఎవ‌రొస్తే.. బాగుంటుంది ? అనే కీల‌క అంశాల‌పైనా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. 


అదేస‌మ‌యంలో టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న‌వారిపై క‌థ‌నాలు రాస్తున్నారు. వీరు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నారంటూ.. గ‌త ప‌ది ప‌దిహేను రోజులుగా క‌థ‌నాల‌ను వండి వారుస్తున్నారు. జ‌న‌సేన‌ను బ‌ల‌ప‌రిచేందుకు ముత్తా ఎంత‌గా కృషి చేస్తున్నా.. ఆయ‌న‌కుకానీ, ఆయ‌న కుమారుడు శ‌శిధ‌ర్‌కు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు టికెట్‌పై జ‌న‌సేనాని ఎలాంటి హామీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఈ ఫ్యామ‌లీ క‌ల‌వ‌ర‌ప‌డుతోంది. గ‌త ఎన్నిక‌ల్లోనే త‌న కుమారుడికి ఎంపీ టికెట్ ఆశించారు ముత్తా. కాకినాడ ఎంపీగా కానీ, రాజ‌మండ్రి సీటును కానీ ఇస్తార‌ని అప్ప‌ట్లో ఆయ‌నే పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా చేసుకున్నారు. 


అయితే, చివ‌రి నిముషం వ‌ర‌కు చంద్ర‌బాబు ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో ఆయ‌న తీవ్ర నిరాశ‌కుగుర‌య్యారు. ఇక‌, ఆ త‌ర్వాత వైసీపీలోకి చేరినా.. జగ‌న్ చేయించిన స‌ర్వే ఫ‌లితాల్లో శ‌శిధ‌ర్‌కు పెద్ద‌గా మార్కులు ప‌డలేద‌ని స‌మాచారం. దీంతో ఆయ‌న కూడా శ‌శిధ‌ర్‌కు టికెట్ ఇచ్చే విష‌యంపై మౌనం వ‌హించారు. ఈ విష‌యాన్ని ముందుగానే గుర్తించిన ముత్తా పెట్టే బేడా స‌ర్దుకున్నా.. జ‌న‌సేన‌లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డం ఇప్పుడు ఏం చేయాలో తెలియ‌క త‌ల‌ప‌ట్టుకుంటున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఎన్నిక‌ల స‌మ‌యానికి జ‌న‌సేనాని ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: