ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ రాజ‌కీయ ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ప‌లువురు నేత‌లు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం ప‌క్క చూపులు చూస్తున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీల్లో వ‌ర్గ‌పోరు భ‌గ్గుమంటోంది. ఆధిప‌త్యంతో ర‌గిలిపోతున్నారు. ఒక‌రిపై ఒక‌రు ప‌ర‌స్ప‌ర ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ఈ ప‌రిస్థితి శ్రీ‌కాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అందులోనూ అధికార టీడీపీలో రాజ‌కీయం రంజుకుంటోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేత‌, మాజీ మంత్రి కోండ్రు ముర‌ళి టీడీపీలోకి వ‌స్తున్నార‌న్న వార్త‌లతో పార్టీలో ముస‌లం ముదురుతోంది. ఆయ‌న రాక‌ను టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జి ప్ర‌తిభాభార‌తి తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. 


త‌న‌ను త‌ప్పించేందుకే పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట‌రావుతోపాటు ప‌లువురు కుట్ర‌లు ప‌న్నుతున్నారంటూ ఆమె ఇప్ప‌టికే సంచ‌ల‌న కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. నిజానికి చాలారోజులుగా కోండ్రు ముర‌ళి టీడీపీలోకి వ‌స్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారానికి మరింత బలాన్ని ఇచ్చేలా కోండ్రు ముర‌ళి క‌ద‌లిక‌లు ఉన్నాయి. శుక్రవారం రాజధానిలోని సచివాలయంలో ఆయన అనుచరులు కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనర్సింహారెడ్డి, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతో.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కూడా కలిశారు. టీడీపీ చేరేందుకు తాను ఆసక్తి చూపుతున్నట్టు చెప్పిన‌ట్లు తెలిసింది. 

Image result for kondru murali

అయితే.. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ పార్టీ ఓడిపోవ‌డం.. నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న కోండ్రును పార్టీలో చేర్చుకుంటే.. టీడీపీకి క‌లిసివ‌స్తుంద‌న్న అంచ‌నాలో బాబు ఉన్న‌ట్లు తెలిసింది. అయంతే కోండ్రును సాదరంగా పార్టీలోకి ఆహ్వానించేందుకు సుముఖత తెలిపినట్టు సమాచారం. అధిష్టానం పిలుపుమేరకు కోండ్రు తన అనుచరులతో సెప్టెంబరు 2న టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. 


కోండ్రు కూడా శనివారం త‌న‌ సన్నిహితులతో రహస్య సమావేశం నిర్వహించి.. కాంగ్రెస్‌ వీడి.. టీడీపీలో చేరేందుకు గల కారణాలను వివరించనున్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కోండ్రు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట‌రావును కూడా క‌లిశారు. ఈ నేప‌థ్యంలో క‌ళాపై పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. ఆమె వ్యాఖ్య‌ల‌పై క‌ళా అభిమానులు మండిప‌డిన విష‌యం తెలిసిందే.

ఈ మేర‌కు  అప్పట్లో నియోజకవర్గం ఇన్‌చార్జిగా ప్ర‌తిభాభార‌తిని త‌ప్పించాల‌ని డిమాండ్ చేస్తూ రాజాం, రేగిడి, వంగర మండలాలల్లోని కళా అభిమానులు ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజు, పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గంటా శ్రీనివాసరావు, కళావెంకటరావుతోపాటు చంద్ర‌బాబు కూడా ఫిర్యాదు చేసిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు టీడీపీలోకి కోండ్రు ముర‌ళి వ‌స్తున్నార‌న్న ప్ర‌చారంతో నియోజ‌క‌వ‌ర్గ టీడీపీలో ముస‌లం మ‌రింత ముదురుతుంద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: