రాజ‌కీయాల్లో శ‌త్రువులు అంటూ ప్ర‌త్యేకంగా ఎక్క‌డో ఉండ‌ర‌ని అంటారు. ఆధిప‌త్య పోరు, టికెట్ జోరు.. పార్టీల‌ను సొంత నాయ‌కులే భ్ర‌ష్టు ప‌ట్టిస్తార‌నేది చ‌రిత్ర చెబుతున్న స‌త్యం! ఇది ఇప్పుడు వైసీపీలోనూ నిజం కానుంద‌ని తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లా కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి ఇలానే త‌యారైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక్క‌డ ఆధి ప‌త్య రాజకీయం, వైసీపీ అధినేత జ‌గ‌న్ వేసిన అడుగులు పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టించే దిశ‌గా సాగుతున్నాయ‌ని చెబుతున్నారు.  ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన కొండ‌పిలో 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల‌లో టీడీపీ త‌ర‌ఫున డాక్ట‌ర్ డోలా బాల వీరాంజ‌నేయ స్వామి పోటీ చేయ‌గా.. ఈయ‌న‌పై వైసీపీ త‌ర‌ఫున మాల మ‌హానాడు నేత‌ డాక్ట‌ర్ జూపూడి ప్ర‌భాక‌ర్ నిల‌బ‌డ్డారు. వాస్త‌వానికి ఈయ‌న గెలిచే ఛాన్స్ ఎక్కువ‌గానే ఉంది. 


అయితే, వైసీపీలో పైన చెప్పుకొన్న విధంగా అంత‌ర్గ‌త ఆధిప‌త్య పోరులో ఆయ‌న‌ను ఓడించేందుకు చాప కింద నీరులా కొంద‌రు నేత‌లు ప్ర‌య‌త్నించారు. ఫ‌లితంగా డోలా గెలుపు గుర్రం ఎక్కారు. దీంతో విసుగు చెందిన జూపూడి పార్టీ మారి పోయారు. ఇక‌, ఆ త‌ర్వాత ఇక్క‌డ ఇంచార్జుగా వ‌రికూటి అశోక్‌ను నామినేట్ చేశారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా ఈయ‌న‌కు టికెట్ వ‌స్తుంద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని వ్యాఖ్య‌లు వినిపించాయి. అయితే, ఈయ‌న బాలినేని శ్రీనివాస‌రెడ్డి వ‌ర్గం కావ‌డంతో ఈయ‌న‌కు చెక్ పెడుతూ.. వైవీ సుబ్బారెడ్డి మాదాసు వెంక‌య్య‌ను రంగంలోకి దిం చారు. వెనుకా ముందుకు అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతోందో ఆలోచించ‌కుండానే జ‌గ‌న్ కూడా మాదాసు వెంక‌య్య‌కు ప‌చ్చ జెండా ఊపారు. 


ఫ‌లితంగా ఇప్పుడు కొండ‌పి వైసీపీలో భోగి మంట‌లు రేగుతున్నాయి. తాను నానా క‌ష్టాలు ప‌డి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీని అభివృద్ధి చేశాన‌ని, త‌న డ‌బ్బంతా.. త‌న క‌ష్టం మొత్తం ఇక్క‌డే క‌రిగించాన‌ని, ఇప్పుడు వేరేవాళ్ల‌కు టికెట్ ఇస్తారా? అని వ‌రికూటి తిరుగుబావుటా ఎగుర‌వేశారు. నిజానికి వ‌రికూటి ఇక్క‌డ  బాగానే ఖ‌ర్చు చేశాడ‌నేది జ‌గ‌న్‌కు కూడా తెలుసు. కానీ, వైవీ మాట‌ల‌తో ఆయ‌న మాదాసుకు అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న నియామ‌కం కూడా అయిపోయింది ఇప్పుడు వ‌రికూటి ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చేందుకు మాదాసును తీసేసి .. తిరిగి వ‌రికూటికి అవ‌కాశం ఇస్తే.. తాను రెబ‌ల్‌గా అయినా మారేందుకు రెడీ అని మాదాసు ఇప్ప‌టికే అనుచ‌రుల‌తో స్ప‌ష్టం చేశారు. ఈయ‌న‌కు వైవీ అండ పుష్క‌లంగా ఉంది. 


పోనీ.. మాదాసుకు ఎలాగూ తెలిసో తెలియ‌కో.. అవ‌కాశం ఇచ్చాం కాబ‌ట్టి ఆయ‌న‌నే కంటిన్యూ చేద్దామ‌ని,ఆయ‌న‌కే టికెట్ ఇద్దామ‌ని అనుకుంటే.. వ‌రికూటి కూడా రెబ‌ల్ గా మారి ఎన్నిక‌ల్లో పోరుకు రెడీ అవుతున్నారు. ఈయ‌న‌కు బాలినేని పూర్తి స‌పోర్టు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవ‌రిని తొల‌గించినా.. మ‌రొక‌రు రెబ‌ల్ కావ‌డం ఖాయం. దీంతో వైసీపీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. దీనంత‌టికీ కార‌ణ‌మైన వైవీ, బాలినేనిల‌ను లైన్‌లో పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌నే సూచ‌న‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఎవ‌రి మాటా విన‌ని అధ్య‌క్షుడు సీత‌య్య ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: