ఆధునిక భారతంలో గురుశిష్య సంబంధం అనురాగం, అనుబంధంతో కొనసాగితే ఇప్పుడు స్నేహబంధంలా అల్లుకుపోతోంది. లోటుపాట్ల సంగతి పక్కనపెడితే ఆధునిక జీవనశైలిలో కొట్టుకుపోతున్న మనకు ఆదిగురువుల గురించి ప్రస్తావించుకునే సందర్భం ఉపాధ్యాయ దినోత్సవం. గు-రు-వు అంటే చీకటి అనే అజ్ఞానాన్ని తొలగించేవాడు అని చెప్పుకోవాలి. గురువు అనుగ్రహం వల్లనే పూర్ణత్వం వస్తుంది.  


గురువుకి దేవునికి భేదం లేదని భావించి గురువు దగ్గర బోధన చేస్తే లౌకిక జ్ఞానమే కాకుండా దైవజ్ఞానం కూడా వస్తుంది. గురువు పట్ల గురుభావాన్ని విడవకూడదని, గురువు చెప్పేవాటిని తిరస్కరించకూడదని, గురువును ద్వేషించకూడదని గురుగీత గురుభక్తిని ప్రబోధిస్తుంది. మనకు తెలియని విషయాలను తెలిపేవారు, గ్రంథాలను రచించినవారు అందరూ గురువులే. 


'ఏకాక్షర ప్రదాతారం' ఒక అక్షరం నేర్పిన వ్యక్తి అయినా గురువే. గురువులు అయిదుగురు. విద్య నేర్పే గురువు, మంత్రోపదేశం దేశం చేసే గురువు, వేదం చెప్పే గురువు, ఉపనయనం చేసినవారు, సద్గురువు. ఈ అయిదుగురు పట్ల గురుభక్తితో వ్యవహరించినట్లయితే సకల విద్యలు, దైవజ్ఞానం అలవడతాయి. గురుభక్తి ఎక్కువగా వున్న శిష్యుడు చేసే పాపాలు కూడా గురువుకి వెళతాయి.


 గురువుల్లో తల్లి శ్రేష్ఠురాలు. పోషించిన వాడు, కన్నవాడు, విద్యాదానం చేసినవాడు, పెద్ద అన్నగారు, మేనమామ వీరందరూ తల్లిదండ్రులతో సమానమైన గురువులే. సంపద కోరేవారు వీరిని విశేషంగా గౌరవించాలి. త్రికరణ శుద్ధిగా అంటే వాక్కు, మనసు, శరీరంతో ప్రీతి కలిగించాలి.  వారితో వివాదం పెట్టుకోవడం, సమాన పంక్తిలో కూర్చోవడం చేయకూడదు. ద్వేషంతో గొడవ పడకూడదు. ధర్మ కార్యాన్ని ఆచరించేటప్పుడు గురువు అనుమతి తీసుకొని చేయాలి. గురువుని పూజించేవారు పుణ్య లోకాలు పొందుతారని మనువు చెప్పాడు.


జగద్గురువులు వ్యాసమహర్షి జగద్గురువు. పురాణాలకు, మహాభారతానికి వేదాలకి సమన్వయం కలిగించడానికి బ్రహ్మసూత్రాలను రచించాడు. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు. తన కాలంలోని శాస్త్రాలని సమన్వయం చేసి సమాజానికి మంచి మార్గం కలిగించాడు. ఎవరి గ్రంథాలను అయినా సరే రాసినవారిని గురువుగా భావించి నమస్కరించి చదివితే ఆ గ్రంథాల్లోని విషయాలు తెలుస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: