రాజ‌కీయాల్లో ఎప్పుడెవ‌రు ఏ పార్టీలో ఉంటారో.. ఎప్పుడు జంప్ అవుతారో చెప్ప‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. అవ‌కాశాలు, అవ‌స‌రాల చుట్టూ నేత‌లు తిరుగుతార‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్య‌మే. ఎన్నిక‌ల ముంగిట తిరిగే వేగం మ‌రింత పుంజుకుంటుంది. అంతేగాకుండా.. ఒక‌రొచ్చి ఇద్ద‌రిని సాగ‌నంపే ఘ‌ట‌న‌లు త‌రుచూ చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లోనూ ఇదే జ‌రుగుతోంది. ఇందులోనూ నెల్లూరు జిల్లా పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌ల‌స‌లు జోరందుకుంటున్నాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంపింగ్‌లు ఊపందుకుంటున్నాయి. అధికార టీడీపీ నుంచి ఇటీవ‌ల ఓ సీనియ‌ర్ నేత వైసీపీలోకి వెళ్ల‌డంతో.. వైసీపీ నుంచి ఓ రాజ‌కీయ కుటుంబ‌మే అధికార టీడీపీలోకి వ‌చ్చేందుకు సంప్ర‌దింపులు జ‌రుపుతుంద‌ట‌. నిజంగానే ఆ కుటుంబం అధికార టీడీపీలోకి వెళ్తే మాత్రం వైసీపీకి పెద్ద దెబ్బేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.


ఈ నేప‌థ్యంలో నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు రెండు పార్టీల్లోనూ వేడిపుట్టిస్తున్నాయి. ఇటీవ‌ల ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి విశాఖ‌ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే. ఆనం రాక‌ను మేక‌పాటి కుటుంబం జీర్ణించుకోలేక‌పోతుంద‌ట‌. నిజానికి గ‌తంలోనే ఈ విష‌యంలో మేక‌పాటి కుటుంబ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆనం వ‌స్తే.. తాము వైసీపీ నుంచి త‌ప్పుకుంటామ‌ని ప్ర‌క‌టించింది. ఇప్పుడు అదే జ‌రిగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో రాజ‌కీయంగా ఆధిప‌త్యం చెలాయించిన మేక‌పాటి కుటుంబానికి ఆనం రాక‌తో మింగుడుప‌డ‌డంలేద‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.  గ‌త‌ ఎన్నిక‌ల్లో  మేక‌పాటి కుటుంబానికి మూడు సీట్లు ద‌క్కాయి. ఉద‌య‌గిరిలో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మిన‌హా నెల్లూరులో రాజ‌మోహ‌న్ రెడ్డి, ఆత్మ‌కూరులో గౌత‌మ్ రెడ్డి గెలిచిన విష‌యం తెలిసిందే. ఒక‌రు ఎంపీగా.. మ‌రొక‌రు ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న వేళ‌.. ఆనం రాక వారిలో ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Image result for మేక‌పాటి

 ప్ర‌స్తుతం ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి వైసీపీలోకి రావ‌డంతో టికెట్లు విష‌యంలో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొనే అవ‌కాశం ఉంది. ఆయ‌న‌కు వెంక‌ట‌గిరి అసెంబ్లీ సీటు ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అంతేగాకుండా.. అవ‌స‌ర‌మైతే నెల్లూరు పార్ల‌మెంటు స్థానంలో ఆనంను బ‌రిలోకి దింపుతార‌నే టాక్ కూడా వినిపించింది. కానీ.. మేక‌పాటిని కాద‌ని జ‌గ‌న్ ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌డం క‌ష్ట‌మేన‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు. అయితే.. ఆనం రాక‌తో మేక‌పాటి కుటుంబంలో ఎవ‌రికో ఒక‌రికి మాత్రం ఎస‌రు ప‌డ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మేక‌పాటి పార్టీ మారాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. అదికూడా అధికార టీడీపీలోకి వెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాము అడిగిన‌న్ని సీట్లు ఇస్తే.. టీడీపీలోకి వ‌స్తామంటూ ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా జ‌రుపుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. దీనిని మంత్రి నారాయ‌ణ డీల్ చేస్తున్నార‌ని, మ‌రికొద్ది రోజుల్లోనే క్లారిటీ వ‌స్తుంద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: