వ‌చ్చే డిసెంబ‌ర్‌లోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, చ‌త్తీస్‌ఘ‌డ్‌, మిజోరం, రాజ‌స్తాన్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తోపాటే తెలంగాణ‌లోనూ ఎన్నిక‌లు జ‌రుగుతాయా..?  ఇందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సిద్ధంగా ఉందా..? అనే దానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. మ‌రో వాద‌న కూడా వినిపిస్తోంది. అదేమిటంటే.. కేసీఆర్ ముంద‌స్తు దూకుడులో ప్ర‌ధాని మోడీ ట్విస్ట్ ఇచ్చే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఇంత‌కీ ఏమిటా ట్విస్ట్ అంటే... ఆ నాలుగు రాష్ట్రాల‌తోపాటే తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా చూడ‌డ‌మే. ముంద‌స్తుకు స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పిన ప్ర‌ధాని మోడీ ఇలా ప్లేట్ ఫిరాయిస్తారా..? అంటే రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గ‌వ‌చ్చున‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇందుకు శుక్ర‌వారం కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రావ‌త్ చేసిన వ్యాఖ్య‌లు బలాన్ని ఇస్తున్నాయి.


ఆ నాలుగు రాష్ట్రాల‌తోపాటు తెలంగాణ‌లోనూ ఎన్నిక‌లు నిర్వ‌హించే అంశంపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలో, లేదో అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓపీ రావత్ చెప్పారు. దీని సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయ‌న‌ వివరించారు. నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ఎవరో చెప్పిన జోష్యంతో ఈసీకి సంబంధంలేదన్నారు. అక్టోబ‌ర్‌లో ఎన్నిక‌ల ప్రక్రియ ప్రారంభ‌మై డిసెంబ‌ర్‌లో ముగుస్తుందంటూ.. నిన్న కేసీఆర్ చెప్పిన విష‌యం తెలిసిందే. తాను కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్‌తో కూడా మాట్లాడ‌డ‌ని.. అన్ని సిద్ధం చేసుకునే ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని కేసీఆర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Image result for elections

ఇదిలా ఉంటే.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, మిజోరంతోపాటు తెలంగాణలో కూడా ఎన్నికలు నిర్వహించాలంటే అందుకు తగిన ఏర్పాట్లను సమీక్షించాల్సి ఉంటుందని రావ‌త్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. 2002లో రాష్ట్రపతి సుప్రీం కోర్టు అభిప్రాయం కోరగా.. అసెంబ్లీ రద్దయినప్పుడు ఎన్నికలు త్వరగా జరపాలని అత్యున్నత న్యాయస్థానం సూచించిందన్నారు. ఎందుకంటే ఆపద్ధర్మ ప్రభుత్వానికి ఆయాచిత ప్రయోజనంపొందేలా ఆరు నెలల పాటు అధికారంలో ఉండకూడదని కోర్టు సూచించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామని రావత్‌ స్పష్టంచేశారు. ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ‌లో రాష్ట్రప‌తి పాల‌న విధించాల‌ని కోరుతూ గ‌వ‌ర్న‌ర్‌ను రాష్ట్ర బిజేపీ నేత‌లు క‌లిసి కోరిన విష‌యం తెలిసిందే. అలాగే తెలంగాణ జ‌న స‌మితి కూడా ఇదే డిమాండ్ చేస్తోంది.

Image result for modi

ఒక‌వేళ ఆ నాలుగు రాష్ట్రాల‌తోపాటు తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండా.. మోడీ ట్విస్ట్ ఇస్తే మాత్రం ఇక కేసీఆర్ హైరిస్క్‌లో ప‌డిన‌ట్టేన‌నే టాక్ వినిపిస్తోంది. ఎన్నిక‌లు ఆల‌స్య‌మైతే.. తెలంగాణ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయ‌మ‌ని.. ప్ర‌జ‌ల నుంచి కేసీఆర్ తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోక త‌ప్ప‌ద‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర మ‌రో విష‌యం ఏమిటంటే.. రాజ‌కీయాల్లో కేసీఆర్ ది ప్ర‌త్యేక పంథా.. ఎక్క‌డి పాట అక్క‌డే పాడుతూ.. ఎప్ప‌టిక‌ప్పుడు ట్విస్ట్‌లు ఇచ్చే ఆయ‌న దారిలోనే క‌మ‌లం పెద్ద‌లు వెళ్లి.. ముంద‌స్తులో ఏదో ట్విస్ట్ ఇస్తార‌నే టాక్ రావ‌త్ మాట‌ల త‌ర్వాత గ‌ట్టిగా వినిపిస్తోంది. ఇక ఏం జ‌ర‌గుతుందో చూడాలి మ‌రి. 


మరింత సమాచారం తెలుసుకోండి: